‘అన్నా ట్యాంకు’ స్థలం ఆక్రమణ

ప్రజాశక్తి-కొత్తపట్నం : మండల కేంద్రమైన కొత్తపట్నంలో తహశీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నా ట్యాంక్‌ స్థలం ఆక్రమణకు గురవుతోంది. గతంలో ఈ చెరువు స్థలం భారీ ఎత్తున ఆక్రమణకు గురైంది. నాలుగైదు రోజులుగా మళ్లీ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. తాజాగా సుమారు ఎకరానికి పైగా చెరువు స్థలం ఆక్రమణకు గురైంది. కొందరు చెరువు స్థలంలో మట్టితోలి చదును చేశారు. అందులో పశువుల పాక ఏర్పాటు చేశారు. రెవెన్యూ కార్యాలయానికి ఎదురుగా ఉన్న జగనన్న కాలనీకి వెళ్లే రహదారి పక్కనే చెరువు స్థలం ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇపప్పటి వరకూ సుమారుగా 20 ఎకరాలపైగా చెరువు ఆక్రమణకు గురైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ చెరువు కింద 400 ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువు నీటిపై ఆధారం పడి అనేకమంది రైతులు పంటలు పండించు కుంటున్నారు. ఈ చెరువు ఆక్రమణకు గురైతే రైతులకు నీటి ఇక్కట్లు తప్పవు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రణల చెరనుంచి చెరువు స్థలాన్ని రక్షించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

➡️