అప్పన్న తెప్పోత్సవానికి ఏర్పాట్లు

 ప్రజాశక్తి-సింహాచలం : పుష్య బహుళ అమావాస్య సందర్భంగా కొండ దిగువ వరహా పుష్కరిణిలో ఈనెల 9వ తేదీన నిర్వహించే స్వామివారి తెప్పోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను ఈవో శ్రీనివాసమూర్తి, ఎసిపి ఎ.నరసింహమూర్తి, డిఇఒ సుజాత, ఆలయ ధర్మకర్తలు గంట్ల శ్రీనుబాబు, దినేష్‌రాజు, రాజేశ్వరి, శ్రీదేవివర్మ, రామలక్ష్మి, సువ్వాడ శ్రీదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, 9వ తేదీన ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కోనేరు వద్ద సంప్రోక్షణ ఉంటుందన్నారు. 4 నుంచి 4:30 మధ్య స్వామివారు కొండపై నుంచి బయలుదేరి మెట్ల మార్గం ద్వారా తొలి పావంచాకు చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు వరాహ పుష్కరిణి వద్ద వేదికపై వైదిక కార్యక్రమంలో దర్శనాలు, అనంతరం హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 8.15 గంటల నుండి సర్వజన మనోరంజనివాహనపై గ్రామ తిరువీధి, అనంతరం పైడితల్లి అమ్మవారి ఆలయం మీదుగా తొలి పావంచ మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటారని ఈవో వివరించారు. అనంతరం వివిధ విభాగాల సిబ్బందితో ఏర్పాట్లపై ఈవో చర్చించారు. గజ ఈతగాళ్ల ఏర్పాటు, హంసవాహనం అలంకరణ, ప్రత్యేక పుష్పాలంకరణ, ఉద్యానవన మండపం, తొలి పావంచ పుష్పాలంకరణ, విద్యుత్‌, మంచినీరు, శానిటరీ ఏర్పాట్లుపై చర్చించారు. ఈ సమావేశంలో ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాంబాబు, ఎఇఒలు భ్రమరాంబ, నర్సింగరావు, పర్యవేక్షణ అధికారులు రమణ, ఎఇ బాబ్జి, పిఆర్‌ఒ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️