అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

ప్రజాశక్తి – ముదినేపల్లి

అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాదఘటన మండలంలోని పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పరసా నాగబాబు(30)కు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూష(25)కు 2015లో వివాహమైంది. వీరికి ఆరేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. నాగబాబు కొంతకాలంగా కౌలుకు మూడు ఎకరాల్లో రొయ్యల చెరువులు సాగు చేస్తున్నాడు. సాగులో నష్టాలు రావడంతో సుమారు రూ.పది లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక నాగబాబు దంపతులు ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనూష తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి.వెంకట్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాలకు గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

➡️