అమ్మకాలు హానికరం

Feb 6,2024 20:53

ప్రజాశక్తి – భోగాపురం : ప్రభుత్వ మద్యం షాపులు నుంచి బెల్టు షాపులకు మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తే పట్టుబడిన వ్యక్తితో పాటు అమ్మకాలు చేసిన షాపులోని సేల్స్‌మేన్‌, సూపర్‌ వైజర్లుపై కూడా కేసులు నమోదు చేసేందుకు కొత్తగా వచ్చిన భోగాపురం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో సిఐ కె. సురేష్‌ సిద్దమయ్యారు. ఇటీవలి అక్రమంగా మద్యం పట్టుబడడంతో సంబంధిత వ్యక్తితో పాటు అమ్మకాలు చేసిన సేల్స్‌మేన్‌ పై కూడా కేసు నమోదు చేయడం విశేషం. అంతేకాక అధికారులు వెంటనే ఆ సేల్స్‌మేన్‌ను కూడా తొలగించారు. ఈ ఘటనతో మద్యం షాపుల్లో పనిచేసే సేల్స్‌మేన్‌లు, సూపర్‌వైజర్లు హడలెత్తిపోతున్నారు. భోగాపురం ఎస్‌ఇబి పరిధిలో 16 ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. ఇటీవలి బదిలీల్లో భాగంగా విశాఖ నుంచి కె. సురేష్‌ ఇక్కడ సిఐగా బాధ్యతలు స్వీకరించారు. పూసపాటిరేగ మండలంలోని పసుపాం గ్రామంలో ఐదు రోజులు కిందట ఓ వ్యక్తి అక్రమంగా మద్యం నిల్వ ఉంచాడన్న సమాచరం వచ్చింది. దీంతో సిఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సుమారు 100 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఇంత మొత్తంలో పట్టుబడడంతో ఇవి ఎక్కడ నుంచి కొనుగోలు చేశారనేదానిపై దృష్టి పెట్టి విచారణ చేశారు. ఖచ్చితంగా ఏదో షాపు సేల్స్‌మేన్‌ హస్తం ఉంటుందని అనుమానించారు. వెంటనే విచారణ వేగవంతం చేశారు. పేరాపురంలో ఉన్న ప్రభుత్వ మద్యం షాపు సేల్స్‌మేన్‌ పైలా సన్యాసిరావు ఇంత మొత్తంలో సీసాలను బయటకు ఇచ్చినట్లు తేలింది. వెంటనే ఏ1గా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని, ఎ2గా సేల్స్‌మేన్‌ను చేర్చి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నెల్లిమర్ల డిపో మేనేజర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే సంబంధిత సేల్స్‌మేన్‌ను తొలగించి కొత్త వ్యక్తిని నియ మించారు. అయితే మద్యంతో పట్టుబడిన వ్యక్తితో పాటు అతనికి మద్యం ఎక్కువ మొత్తంలో విక్రయించిన వ్యక్తిపై కూడా కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.సీసాపై రూ.పది వసూలు చేసి విక్రయంప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న కొంత మంది సేల్స్‌మెన్లు, సూపర్‌వైజర్లు గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించే వారితో ముందస్తుగా ఒప్పందం చేసుకుని సీసాపై ఐదు నుంచి పది రూపాయలు వరకూ అదనంగా తీసుకొని విచ్చలవిడిగా బెల్టు షాపులకు వందలాది సీసాలను ఇచ్చేస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహుకులు అదే సీసాపై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేసి మందుబాబులను దోచుకుంటున్నారు. కాసులకు కక్కుర్తి పడిన సేల్స్‌మేన్లు, మేనేజర్లు విచ్చలవిడిగా మద్యం సీసాలను బెల్టుషాపులకు ఇవ్వడంతో గ్రామాల్లో బెల్టు షాపుల సంఖ్య పెరిగిపోయింది. పసుపాం సంఘటనతో ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సేల్స్‌మేన్లు, సూపర్‌ వైజర్లు అప్రమత్తమయ్యారు.సేల్స్‌మేన్‌ పై కేసు ఇదే మొదటి సారిప్రభు త్వం ఎస్‌ఇబి శాఖ ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటి వరకూ ఎంతో మంది అధికారులు బెల్టు షాపులపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. వందల్లో మద్యం సీసాలు పట్టుబడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాని పట్టుబడిన వ్యక్తులు తప్ప సేల్స్‌మేన్‌లపై కేసు నమోదు చేయడం ఇప్పటి వరకు జరగలేదు. కొత్తగా వచ్చిన సిఐ మాత్రం మొట్టమొదటిసారి ఇలాంటి కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. తీరప్రాంత గ్రామాల్లో నిబంధనలకు విరుద్దంగా బెల్టుషాపులు కోసం వేలం పాటలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలి లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు భోగాపురం మండలంలో వేలం పాట పాడిన రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను మద్యం సీసాలతో పట్టుకొని కేసులు నమోదు చేశారు. పూసపాటిరేగ మండలంలో ఎస్‌ఇబి అధికారులు కూడా భారీగా మద్యం సీసాలతో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో బెల్టుషాపుల నిర్వాహుకులు, మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది వెన్నులో వణుకు మొదలైందన్న చర్చ జరుగుతోంది.కచ్చితంగా కేసులు నమోదు చేస్తాం ప్రభుత్వం మద్యం షాపులు నుంచి విచ్చలవిడిగా బెల్టు షాపులకు మద్యం అమ్మడం నేరం. అక్రమ మద్యం కలిగి ఉన్న వారెవరైనా పట్టుబడితే విచారణ చేస్తాం. ఇందులో సేల్స్‌మేన్‌, సూపర్‌వైజర్‌ పాత్ర ఉందంటే వారిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. అందుకు ప్రభుత్వ నిబంధనలకు లోబడే అమ్మకాలు చేయాలి.కె. సురేష్‌, ఎస్‌ఇబి, సిఐ, భోగాపురం

➡️