అరాచక పాలనకు చరమగీతం పాడుదాం: కందుల

ప్రజాశక్తి-పొదిలి రాష్ట్రంలో అరాచక పాలనకు చరమ గీతం పాడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలో బుధవారం విశ్వనాధపురంలో 8,9 వార్డుల్లో ‘బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల ఇంటింటికీ తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సారథ్యంలో వైసిపి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతూ ప్రజా సంపదను దోచుకుంటోందని విమర్శించారు. ప్రజలకు నవరత్నాల పేరుతో టోకరా వేసి పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుంటూ విలాసాలకు అలవాటుపడ్డ జగన్‌ ప్రభుత్వం వారి నాయకులు రాష్ట్రంలో అక్రమాలు, ఆక్రమణలతో అరాచకాలకు పాల్పడుతున్నారని ద్వజమెత్తారు. కానీ ఈ ప్రభుత్వం ఎవరి పెన్షన్‌ తీస్తున్నారో, ఎప్పుడు ఎవరిని పోలీస్‌ స్టేషన్లో పెడుతున్నారో, ఎరువు ఎవరి ఆస్తులు కొల్లగొడతారో ప్రజలకు తెలుసునని, వారు ఏమాత్రం సంతోషం లేకుండా జీవిస్తున్నారని అన్నారు. ఈ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మద్యనిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నాయకులే గ్రామాల్లో బెల్ట్‌ షాపులు పెట్టుకుని నడుపుతున్నారని, కరెంట్‌ ఛార్జి విపరీతంగా పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారన్నారు. తాను చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకుని ఆలోచించి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కాటూరి వెంకటనారాయణరావు (పెద్దబాబు) పొదిలి పట్టణ తెలుగుదేశం నాయకులు మిగడ ఓబుల్‌రెడ్డి, ముల్లా ఖుర్దూస్‌, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, న్యాయవాది ఎస్‌ఎం బాషా, మాజీ సర్పంచ్‌ స్వర్ణ గీత, నాయకులు ఎస్‌కె రసూల్‌, శామంతపూడి నాగేశ్వరరావు, తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జ్యోతి, మల్లికార్జున, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడుగడుగునా కందులకు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు.

➡️