అరెస్టులు.. గృహా నిర్బంధాలు

Jan 22,2024 23:28
అంగన్‌వాడీలపై ప్రభుత్వం

ప్రజాశక్తి – యంత్రాంగం

అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపింది. ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని భయ పెట్టేందుకు ప్రయత్నించింది. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని షోకాజ్‌ నోటీసులను అందించింది. అయినా అంగన్‌వాడీలు మొక్కవోని ధైర్యంతో తమ పోరాటాన్ని సాగిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మో హన్‌ రెడ్డికి సోమవారం అందించాలని చలో విజయవాడకు బయలుదేరారు. అయితే ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తూ అంగన్‌వాడీలపై పోలీసులతో ఉక్కుపాదాన్ని మోపింది. విజయవాడకు బయలుదేరిన అంగన్‌వాడీలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ల్‌కు తరలించారు. ఇంటి వద్ద ఉన్న వారిని గృహ నిర్బాంధానికి పాల్పడ్డారు. కాకినాడ అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ దమనకాండను ప్రజలంతా ఖండించాలని అంగన్‌వాడీ వర్కర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఒత్తిడులు మధ్య స్థానిక ధర్నా చౌక్‌ వద్ద అంగన్‌ వాడీల నిరసన కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కోశాధికారి ఎం.రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అరెస్టులు జరుగుతున్నా విజయ వాడలో, జిల్లాలో కూడా ఆందోళన సాగిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె విర మించబోమన్నారు. సిపి ఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయ కులు సి.వెంకట్రావు, దుంపల ప్రసాద్‌ తదిత రులు ఆందోళనకు సంఘీ భావం తెలిపారు. ప్రభు త్వం తక్షణమే అంగన్‌ వాడీల సమ్మె డిమాం డ్స్‌ను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమం మరిం త తీవ్రతరం అవుతుం దన్నారు. అధికారానికి వచ్చే ముందు జగన్మోహన్‌ రెడ్డి నాడు పోలీసు చర్యలను ఖండించిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. మహిళలపై మగ పోలీసుల దాష్టీకం చూస్తుం టే అన్ని రకాల ప్రజాస్వామిక చట్టాలను తుంగలో తొక్కుతున్నా రని దుయ్య బట్టారు. అరెస్టులు జరుగుతున్నా ఆందోళనలు కొన సాగుతున్న తీరు చూసి ప్రభుత్వం దిగి రావాలన్నారు. ముఖ్యమంత్రి హామీ నిలబెట్టు కోవాలని డిమాం డ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్‌, రూరల్‌, తాళ్ళ రేవు, కరప, కాజులూరు మండ లాల అంగన్‌వాడీలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. గండేపల్లి గండేపల్లిలో అంగన్‌వాడీల కోసమే సిఐ లక్ష్మిణరావు, జగ్గంపేట, గండేపల్లి ఎస్‌ఐలు నాగార్జున, ఎన్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్‌ పీకేట్‌ ఏర్పాటు చేశారు. విజయవాడకు వెళ్లేందుకు బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లే అంగన్‌వాడీలను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అడు ్డకున్నారు. మండలానికి చెందిన అంగన్‌వాడీలను తిరిగి తమ తమ గ్రామాలకు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. విజయ నగరం నుంచి ప్రత్యేక బస్సులో వెళ్తున్న 42 మంది అంగన్‌ వాడీలను అర్ధరాత్రి 2 గంటలకు నిలుపుదల చేసి తహశీల్దార్‌ కార్యాలయం ఆరుబయటే ఉంచారు. రాతంత్రా చలిలోనే అంగన్‌వాడీలు ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు అంగన్‌ వాడీలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్‌వాడీలపట్ల కర్కసంగా వ్యవహరిస్తున్నారని, అర్థరాత్రి మహిళలను పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌ను ఖచ్చితంగా గద్దెదించుతామని హెచ్చరించారు. తాళ్లరేవు సోమవారం తెల్లవారుజామున విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీలను కోరంగి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని కోరంగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గుత్తుల రామలక్ష్మీ, దంగేటి సత్యవేణి, కూరాటి పార్వతి, వాడపర్తి దుర్గా మహాలక్ష్మి, పెచ్చెట్టి ఆదిలక్ష్మి, పెయ్యల సుబ్బలక్ష్మిలను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విడిచి పెట్టారు.

అక్రమ అరెస్టులపై ఖండన

నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్‌వాడీ నాయకులతోపాటు వేలాది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టులు చేయడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వందలాది మంది పోలీసులు అంగన్‌వాడీల నిరసన శిబిరాల్లో వేసిన టెంట్‌లను పీకేసీ మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు అమానుషంగా వ్యవహరించడం దారుణమన్నారు. తక్షణం అరెస్టు చేసిన వారిని విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం ఖండన

అంగన్‌వాడీలపై పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ముందుగా నోటీస్‌ ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. 42 రోజులైనా సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయం అని విమర్శంచారు. ప్రజల మద్దతుతో జరుగుతున్న ఈ సమ్మెకు, ప్రజలు చేసిన కోటి సంతకాలు తీసుకుని జగనన్నకు చెబుదామని విజయవాడ వెళ్తున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, పోలీస్‌ స్టేషన్లో పెట్టడం అక్రమమని అన్నారు. తక్షణం ఈ అరెస్టులను ఆపి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని, అందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

➡️