అరెస్టులు, నిర్బంధాలకు బెదరం

అరెస్టులు, నిర్బంధాలకు బెదరం

ప్రజాశక్తి-అమలాపురంఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ముఖ్యమంత్రి జగన్‌ మహిళలను అణగదొక్కాలని చూస్తున్నారంటూ అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలో విజయవాడ పిలుపు నేపథ్యంలో జిల్లా నుంచి విజయవాడకు పలువురు కార్యకర్తలు ఆదివారం బయల్దేరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి అంగన్‌వాడీలను అడ్డుకున్నారు. రైళ్లు, బస్సుల్లోకి వెళ్లి విజయవాడ వెళ్తున్న కార్యకర్తలను బలవంతంగా దించేశారు. అదుపులోకి తీసుకుని సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. జిల్లా నుంచి 600 మంది విజయవాడకు తరలి వెళ్లినట్లు నాయకులు తెలిపారు. పోలీసులు ఉద్యమకారులకు నోటీసులు ఇచ్చి 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజోలులో సుమారు 31 మందిని, అంబాజీపేటలో 23 మంది అంగన్వాడీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న శిబిరాలను తొలగించి అంగన్వాడీలను హౌస్‌ అరెస్టు చేయడం సమ్మె నోటీసులు జారీ చేయడం చేశారు. సోమవారం అంగన్వాడీలను పోలీస్‌ స్టేషన్లో నిర్భందించారు. అయినా సరే వెనక్కి తగ్గేది లేదని తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు చెబుతున్నారు.ఎన్ని అడ్డంకులు వచ్చిన సమ్మెను ఆపేది లేదుప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సష్టించినా అంగన్వాడీల సమ్మె ఆపే ప్రసక్తి లేదు. చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా దారుణం. 42 రోజుల నుండి సమ్మె చేస్తుంటే ప్రభుత్వంలో చలనం లేకపోగా ఉద్యోగాల నుండి తొలగిస్తామనడం ఎంతవరకు సబబు. రాత్రి నుంచి పోలీసుల గృహనిర్బంధాలు, అరెస్టులతో అంగన్వాడీలను వేధిస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు వెనక్కి తగ్గేది లేదు.- కె.బేబీ గంగారత్నం, అమలాపురం ప్రాజెక్టు కార్యదర్శి. అర్ధరాత్రి దీక్షా శిబిరాలు తొలగిస్తారా..42 రోజుల నుంచి సమ్మె చేపడదితే సమస్యకు పరిష్కారం చూపకపోగా అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని తొలగించడం ఎంతవరకు సమంజసం. నాలుగు ఐదు రోజుల క్రితం ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తే మండలం మొత్తం సమైక్యంగా వివరణ ఇచ్చాం. కనీస వేతనం కోసం సమ్మె చేపట్టిన పెరిగిన ధరలు కనుగుణంగా కనీస వేతనం పెంచకుండా నిరంకుశంగా వ్యవహరించడం దారుణం.- మట్టపర్తి వెంకటలక్ష్మి, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌, అంబాజీపేట.అంగన్‌వాడీలను నేరస్తుల్లా చూడడం దారుణంపెరిగిన ధరల నేపథ్యంలో చాలీచాలని జీతంతో ఒకపక్క, అంగన్వాడీలు సొంత ఖర్చులతో బిల్లులు రాక అనేక రకమైన ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ వర్కర్లను ఈ విధంగా నేరస్తుల్ని చూసినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు. 42 రోజులుగా జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా ధర్మపోరాటం చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్‌ను విధుల నుంచి తొలగించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడం ఏమాత్రం తగదు. వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఓటర్లు తన శక్తి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. – గంటి హరీష్‌ బాలయోగి,టిడిపి అమలాపురం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి.

➡️