అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాలు

Dec 17,2023 21:31

 ప్రజాశక్తి – వీరఘట్టం :  మండలంలోని మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మండలం లోని రెండో విడత కింద 29 పాఠశాలలకు గానూ రూ.9 కోట్ల 43 లక్షల పైచిలుకతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. చేసిన పనులకు బిల్లులు చెల్లింపుల్లేక గుత్తేదారులు పనులు అర్ధాంతరంగానిలిపివేశారు. మండలంలోని కంబరవలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ.88 లక్షలతో మూడు అదనపు భవనాలు నిర్మించేందుకు గత ఏడాది పనులు ప్రారంభించారు. అయితే ఈ మూడు భవనాలు పునాదులకే పరిమితి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు భవన నిర్మాణాలు కూడా అరకొరగానే పనులు ప్రారంభించి నిలిపివేశారు. 29 పాఠశాలల్లో కోమటివీధి, రెగ్యులర్‌ పాఠశాలల తప్ప ఎక్కడా భవనాల పనులు చేపట్టేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చే దాఖలాలు కనిపించ లేదు. భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఆయా పాఠశాల విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది మే 6న సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి కంబరవలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించినప్పుడు పాఠశాల పనులు వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల పున: ప్రారంభానికి పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా ఏడు నెలలు కావస్తున్నా పనులు ముందుకు సాగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️