అర్హతే ప్రామాణికంగా పథకాలు

Jan 6,2024 23:25
అర్హతే ప్రామాణికంగా ప్రతీ

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

అర్హతే ప్రామాణికంగా ప్రతీ పేద వాడికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, వైసిపి రాజమహేంద్రవరం రూరల్‌ కో-ఆర్డినేటర్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శనివారం రూరల్‌ మండలం హుకుంపేట గ్రామపంచాయతీ డి మార్ట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడిన వ్యక్తి సిఎం జగన్మోహన్‌ రెడ్డి అని అన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం పెన్షన్‌ ఫైల్‌పై చేశారని తెలిపారు. నెలలో మొదటి తేదీ ఉదయాన్నే లబ్ధిదారులకు పెన్షన్‌ అందిస్తూ వారి కళ్ళల్లో వెలుగులు నింపుతున్నా రన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలకు చెందిన పేద ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ పాలన సాగిస్తున్నారని మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో 20, 141 మంది లబ్ధిదారులకు రూ.6 కోట్ల 6 లక్షల 49 వేలను అర్హులైన లబ్ధిదారులందరకు పెన్షన్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం సచివాలయం, కలెక్టరేట్‌, వాలంటరీ వ్యవస్థలను తీసుకువచ్చి మీ గ్రామాల్లోనే అర్హులకు తలుపు తట్టి సంక్షేమ పథకాలను అందజేస్తు న్నామని చెప్పారు. రూరల్‌ మండలంలో పదివేల మందికి అందించే పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేద వారందరికీ సంక్షేమ పథకాలను ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను పెంచేవిధంగా చేదోడు, ఆసరా, ఫీజు రియంబ ర్స్మెంట్‌, జగనన్న చేయూత వంటి పథకాల ప్రయో జనాలను అనేక మంది అర్హులైన పేద ప్రజలం దరికీ అందజేస్తున్నామన్నారు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణయే లక్ష్యంగా ఆరోగ్య భరోసాను కల్పిస్తూ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ స్థాయిలో ఖరీదైన వైద్యాన్ని అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ పిల్లి నిర్మల, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ముద్దాల అను, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పికె. రావు, మాజీ ఎంపిపి రేలంగి వీర వెంకట సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎం.జ్యోతి, ఎంపిడిఒ డి.శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

➡️