అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు : ఎంపీ

Dec 24,2023 21:22

ప్రజాశక్తి-పీలేరు పేదలందరికీ ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిదేనని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివారం పీలేరు మండలంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 3300 ఇళ్ల పట్టాలను ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ఏ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టలేదని తెలిపారు. జగన్‌ వచ్చిన తర్వాతనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. జగనన్న హౌసింగ్‌ కాలనీలలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు విద్య, వైద్య సేవలు అందింస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాలు అందిన వారు తమ ఆస్తిని అమ్ముకోకుండా తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామని, పేదలందరూ ఇల్లు కట్టుకొని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీలేరు నియోజకవర్గం అభివద్ధి చెందిందని, దీనంతటికీ కారణం గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలేనని తెలిపారు. కార్యక్రమంలో పీలేరు తహశీల్దార్‌ ధనుంజరు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️