అలరించిన రాయబార ఘట్టం

ప్రజాశక్తి – కారంపూడి : పల్నాటి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన బుధవారం ‘రాయబార ఘట్టం’ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 14 జిల్లాల నుండి వచ్చిన వీరాచారవంతులు వారి పూర్వీకులు నాడు యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను తీసుకొని నిధి (వీరాచార పీఠం) మీదకు చేరుకున్నారు. పీఠం అధిపతి అయిన పిడుగు తరుణ్‌ చెన్నకేశవలు ఆధ్వర్యంలో ఆయుధాలను జీవనది అయిన నాగులేరులో స్నానమాచరింపచేసి ఊరేగించారు. అనంతరం సాయంత్రం రాయబార ఘట్టాన్ని బుర్రకథ రూపంలో సందర్శకులకు కళాకారులు కళ్లకు కట్టినట్టుగా వివరించారు. నాడు యుద్ధానికి ముందు రాయబారం కోసం మలిదేవరాజు సమీప బంధువైన అలరాజును పంపగా నాయకురాలు నాగమ్మ కుతంత్రం పని అలరాజును చంపిన ఘట్టాన్ని బుర్రకథగా వివరించారు.ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన గురువారం మందపోరు కార్యక్రమంలో ఏటా చాపకుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాన్ని నిర్వహిస్తారు. 11వ శతాబ్దంలోనే కులమతాలు కతీతంగా నాడు బ్రహ్మనాయుడు చాపకుడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆచరించాడు. వీరాచార పీఠం ఏర్పడిన దగ్గర నుండి నేటికీ సుమారు 900 ఏళ్లకుపైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎస్సీ వై.రవిశంకర్‌రెడ్డి హాజరు కానున్నారు.

➡️