అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

Dec 15,2023 20:56

 ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  :   రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను ప్రతి నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శుక్రవారం స్థానిక గాయత్రి డిగ్రీ కాలేజీలో జరిగే జాబ్‌ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ జాబ్‌ మేళాలో 16 కంపెనీల సభ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఎంపికైన వారికి అర్హత పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం పార్వతీపురంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ హబ్‌ భవనం నిర్మాణం ప్రారంభించి, అతి త్వరలో అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను అందిస్తామన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అదే భవనంపై వసతి కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా స్కిల్‌ డెవలప్మెంట్‌ అధికారి సాయికుమార్‌ మాట్లాడుతూ జాబ్‌ మేళాకు సుమారు 521మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, అందులో 136 మంది వివిధ కంపెనీల్లో ఎంపికైనట్టు తెలిపారు. టిడ్కో చైర్మన్‌ జమ్మాన్న ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఇలాంటి జాబ్‌ మేళా ద్వారా ఉద్యోగాలు పొందాలన్నారు. కార్యక్రమంలో రీజనల్‌ నైపుణ్యాభివృద్ధి అధికారిణి రోహిణి, జూనియర్‌ ఎంప్లాయి మెంట్‌ అధికారి వహీదా, గాయత్రి కళాశాల కరెస్పాండెంట్‌ మణి కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️