అవగాహనతో వినియోగదారుల విజయం

Mar 15,2024 21:03

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : వినియోగదారుల చట్టంపై అవగాహనతో వారికి విజయం లభిస్తుందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌.శివప్రసాద్‌ అన్నారు. స్థానిక లయిన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పౌరసరఫరాల శాఖ, జిల్లా వినియోగదారుల హక్కులు రక్షణ సంఘం సంయుక్తంగా శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎస్‌ఒ మాట్లాడుతూ వినియోగదారులకు ఇచ్చిన హక్కులను ప్రజలు ఉపయోగించుకోవాలని, హక్కులు తెలుసుకొని నడుచుకోవాలని అన్నారు. ఎక్కడైనా మోసపోతే సంబంధిత వినియోగదారుల సంఘాలకు గానీ, ప్రభుత్వాధికారులకు గానీ తెలపాలని కోరారు. సంఘం అధ్యక్షులు పి.సూర్యారావు మాట్లాడుతూ అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా అవగాహన కలిగించి చట్టాన్ని ముందుకు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి మాన్యు రామకృష్ణ మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ప్రజలు మోసపోతున్న కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారన్నారు. ఉచిత న్యాయ సహాయంపై ప్రజలు అర్థం చేసుకోవాలని, భావితరాల విద్యార్థులు చట్టం పరిధిలో ఉన్న అనేక ఉపకారాలను తెలుసుకొని ప్రశ్నించే తత్వం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కొన్న ప్రతి వస్తువు బిల్లు తీసుకోవాలన్నారు. తమ సంఘం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రతి శనివారం సమావేశం జరుగుతుందని, ఫిర్యాదులు ఎలాంటివైనా రాతపూర్వకంగా తెలియజేస్తే ఉచిత న్యాయ సహాయం జరుగుతుందని ఆయన అన్నారు. సమావేశంలో లీగల్‌ మెట్రాలజీ, ఆహార భద్రత అధికారులు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ, సేంద్రియ పంటల రైతులు, ఉద్యోగులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

➡️