ఆందోళన విరమించబోం

5వ రోజుకు చేరుకున్న మునిసిపల్‌ కార్మికుల సమ్మెప్రజాశక్తి – కడప అర్బన్‌ మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకూ ఆందోళన విరమించబోమని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు సుంకర రవిపేర్కొన్నారు. పాత మునిసిపల్‌ ఆఫీస్‌ వద్ద తెల్లవారు జాము నుంచే మహిళ కార్మికులు, డ్రైవర్లు, లోడర్లూ, సిఐటియు ఆధ్వర్యంలో వాహనాలను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్‌ ఆఫీస్‌ ఎదుట వైసిపి ప్రభుత్వం కార్మికులకు ఉరి వేసింది అన్నట్లు మెడకు ఉరి వేసుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌ నగర్‌ అధ్యక్షులు మాట్లాడుతూ సమ్మె మొదలై 5 రోజుల అవుతున్నా ప్రభుత్వం చలనం లేకుండా పోయిందని వాపోయారు. బాధ్యత కలిగిన మంత్రి అది ములపు సురేష్‌ కార్మికులను నీచంగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని చెప్పారు. సిఎం కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నాలుగున్నరేళ్లుగా ఎదు చేసి పలు ఆందోళనలు, చర్యలు జరిపి ఇప్పుడు నిరవధికంగా సమ్మెకు సిద్ధపడ్డామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మైదుకూరు : మున్సిపల్‌ కార్మికుల సమ్మె శనివారం ఐదవ రోజుకు చేరుకుంది. అప్కాస్‌ లేకుండా పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పనికితగ్గ వేతనం ఇవ్వాలని, ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌,రిస్క్‌ అలవెన్స్‌ లు, టెక్నికల్‌ వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ -19 సమయంలో పనిచేసిన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పట్టణ విస్తీర్ణం, పెరుగుతున్న జనాభా దష్ట్యా కార్మికులను పెంచాలని డిమాండ్‌ చేశారు. మైదుకూరు మున్సిపల్‌ (సిఐటియు) ట్రెసరర్‌ జి. చిన్న అధ్వర్యంలో లక్షుమయ్య, శేఖర్‌, వెంకట సుబ్బయ్య, పుళ్ళమ్మ, విశ్వనాధం, చిన్న రాముడు, నాగయ్య, పాపారాయుడు, ఒబులమ్మ, కార్మికులు పాల్గొన్నారు. బద్వేలు : మున్సిపల్‌ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 5 రోజులో భాగంగా శనివారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయం వద్ద బద్వేల్‌ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌( సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల బెలూన్లతో తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని గడచిన ఐదు రోజులుగా మున్సిపల్‌ కార్మికులు రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె నిర్వహిస్తుంటే ప్రభుత్వం సమ్మె విరమణకు అవసరమైన చర్యలు చేపట్ట కపోవడం దారుణమని వాపోయారు. సమ్మెకు బద్వేల్‌ పురపాలక సంఘం 13వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌ షేక్‌ హసన్‌ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు, పట్టణ కో- కన్వీనర్‌ పి.సి.కొండయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, పట్టణ కార్యదర్శి జి. నాగార్జున, నాయకులు జీవి రమణారెడ్డి, ఆదిల్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్షులు పులి శ్యాం ప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు నాగరపు సత్యరాజు, బద్వేల్‌ ప్రవీణ్‌ కుమార్‌, నేలటూరు పాలయ్య, కోశాధికారి కాలువ శివకుమార్‌ కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య, ఇండ్ల చంద్రశేఖర్‌, తేళ్ల కిరణ్‌ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : అపరిషృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం ఐదవరోజుకు చేరుకుంది. కౌన్సిల్‌ సమావేశానంతరం ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పిలుపు మేరకు కార్మిక సంఘ నాయకులు సాల్మన,్‌ చంటి మిగిలిన నాయకులు ఎమ్మెల్యేతో చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన సొంత నిధులు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున అదనంగా ఇస్తామన్నారు. దీంతో పాటు రూ.2లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తామని, తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరాలని తెలిపారు. స్పందించిన కార్మిక సంఘ నాయకులు తన సొంత నిధులు ఇస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఈ సమ్మె జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందని తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే బాగుటుందన్నారు. ఈ సమ్మెలో 240 మంది కార్మికులతో పాటు 40 మంది క్లాప్‌ డ్రైవర్లు పాల్గొన్నారు. జమ్మలమడుగు : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలనే డిమాండ్లతో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు స్థానిక మున్సిపల్‌ మస్టర్‌ పాయింట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శేఖర్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, సిఐటియు కమిటీ సభ్యులు నాగన్న, కోశాధికారి శివన్న, చెన్నయ్య. గ్రేస్‌ అమ్మ. పట్టణ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

➡️