ఆకలి కేకలతో రగిలిన భోగి మంటలు

Jan 14,2024 22:41
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు,

ప్రజాశక్తి – యంత్రాంగం

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 34వ రోజుకు చేరింది. కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సిన క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలతోపాటు, ఆదివారం జరిగిన భోగి పండుగను నడి రోడ్డుపైనే వారు జరుపుకోవాల్సివచ్చింది. ఇందుకు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగన్‌వాడీల ఉద్యమం పట్ల అవలంభించిన నిరంకుశ విధానాలే కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా అంగన్‌వాడీలు రెట్టించిన ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అంగన్‌వాడీలపై జగన్‌ సర్కార్‌ విధించిన ఎస్మా చట్టం ప్రయోగాన్ని నిరసిస్తూ ఎస్మా ప్రతులను తమ ఆకలికేకలతో రగిలిన భోగి మంటల్లో దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

కాకినాడ స్థానిక సమ్మె శిబిరం వద్ద అంగన్‌వాడీలు ఎస్మా చట్టం ప్రతులను భోగి మండల్లో వేసి దహనం చేశారు. సమ్మె డిమాండ్లు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాల్సిన భోగి మంటలను నిరసన శిబిరంలో చేసుకోవాల్సిన దుస్థితికి వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికిపైగా అంగన్‌వాడీలు తమ ఆకలి కేకలతో భోగి పండుగను నడి రోడ్డుపై జరుపుకోవాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో ఆరు దఫాలు చర్చలు జరిగిన సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఒకసారి మాత్రమే చర్చల్లో పాల్గొన్నారని, రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్‌వాడీలు పెరిగిన ధరలు కనుగుణంగా వేతనాలు పెంచమని 34 రోజులుగా సమ్మె చేస్తుంటే జగన్‌ ప్రభుత్వం మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తుందని విమర్శించారు. వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా రాష్ట్రం లో ఉన్న మేథావివర్గం కూడా కదులుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశాన్ని సభ్యులకు వివరిం చారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ అంగన్‌వాడీలు చాలా పట్టుదలతో చేస్తున్న సమ్మె అనేక ఉద్యోగ, కార్మిక సంఘాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, యుటిఎఫ్‌ తరఫున మీరు చేసేటువంటి పోరాటంలో పండగ సెలవుల అనంతరం రిలే దీక్షలో మేము కూడా పాల్గొంటామని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.18 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉం దని, ఉద్యోగుల, కార్మికుల సమస్య లు పరిష్కారంచడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇదే పట్టుదలతో వేతనాలు పెంచుకునేంతవరకు సమ్మెను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమ్మె శిబిరం లో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషాబాబ్జి, చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్సులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు సీనియర్‌ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, కాకినాడ అర్బన్‌, రూరల్‌ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రమా, వీరవేణి, మున్నీ, చామంతి, విజయ, శ్రీదేవి, అర్బన్‌, రూరల్‌ అంగన్‌వాడీలు ఉన్నారు.

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరం వద్ద నుంచి మిరపకాయల వీధిలోని రామాలయం వరకు అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఎస్మా చట్టం జీవో నెంబర్‌ 2 ప్రతులను, అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసుల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు దాడి బేబీ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పండుగ పూట రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి నుంచి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కోటి సంతకాలతో వినతిపత్రం అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్‌, నీలపాల సూరిబాబు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు నాగమణి, అమల, ఎస్తేరు రాణి, బాలం లక్ష్మి, టిఎల్‌.పద్మావతి, లోవతల్లి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, భవాని, పద్మ, దేవి, తులసి తదితరులు పాల్గొన్నారు.

జగ్గంపేట రూరల్‌ స్థానిక పంచాయతీ అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద భోగి సందర్భంగా హరిదాసుతో సంకీర్తనలు పాడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం పెంచాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, తదితర డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీలు సుజాత, రాజేశ్వరి, రామ్‌ లీలా, అనంతలక్ష్మి, గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన శిబిరం వద్ద భోగిమంటలు వేసి అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భోగి మంట చుట్టూ కోలాటం చేశారు.

కరప స్థానికంగా జరుగుతున్న నిరసన శిబిరం వద్ద అంగన్‌వాడీలు భోగి మంటల్లో ఎస్మా చట్టం ప్రయోగిస్తూ జగన్‌ సర్కార్‌ విడుదల చేసిన జిఒ నెంబర్‌ 2 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకురాలు పి.వీరవేణి మాట్లాడుతూ అంగన్‌వాడీల పట్ల సిఎం జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భవాని, బి.అచ్చరత్నం, ఆర్‌.దైవ కుమారి, ఎస్‌.వరలక్ష్మి, జిఎకెఎల్‌. నారాయణమ్మ, సాయి, జ్యోతి పాల్గొన్నారు. కిర్లంపూడి స్థానిక అంగన్‌వాడీల నిరసన శిబిరం వద్ద ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భోగి మంటల్లో ఎస్మా ప్రయోగిస్తూ తీసుకొచ్చిన జిఒ నెంబర్‌ 2 ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జి.రత్నం, పి. మంగాయమ్మ, పి.ప్రభావతి, హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

➡️