ఆకలి కేకలు పట్టవా?

Jan 10,2024 21:25

 ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌  :   పక్షం రోజులకు పైగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మున్సిపల్‌ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ఆకలి బాధలు సర్కారు చెవికెక్కడం లేదని మండిపడ్డారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పార్వతీపురంలో మున్సిపల్‌ కార్మికులు వేపకొమ్మలు కట్టుకుని సమ్మె శిబిరం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి వీడి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మామిడి శివ, బంగారు రాజేషు, గుంట్రెడ్డి గంగయ్యలు, తాడ్డి వినరు, వి.అప్పలనాయుడు, మేడిశెట్టి కృష్ణ, అరసాడ తాతబాబు, తదితరులు పాల్గొన్నారు.

సాలూరు : మున్సిపల్‌ కార్మికుల సమ్మె 16 రోజుకు చేరింది. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ముందు 16 అంకె రూపంలో కూర్చుని ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు టి.శంకరరావు, టి.రాముడు, పోలరాజు టి.రవి, ఇందు, స్వప్న పాల్గొన్నారు.

➡️