ఆడుదాం-ఆంధ్రాకు 1.47 లక్షల మంది నమోదు

ప్రజాశక్తి – ఏలూరు

జిల్లాలో ఈనెల 26వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో పండుగ వాతావరణంలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జెసి బి.లావణ్యవేణి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమర్థవంతంగా నిర్వహించేందుకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని సిఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం – ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, గతంలో ఎన్నడూ జరగని విధంగా పెద్దఎత్తున ఐదుస్థాయిల్లో జరుగుతోందని, ఇందులో ఆసక్తిగల క్రీడాకారులను, ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. టోర్నమెంట్‌లో క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, బ్యాడ్మింటన్‌ వంటి ప్రధాన క్రీడలు గ్రామ, వార్డు సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో జరగను న్నాయన్నారు. ఈనెల 26వ తేదీన మంగళవారం నుండి 605 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో క్రీడాపోటీలు సజావుగా నిర్వహించాలన్నారు. క్రీడా సంబరాల్లో పాల్గొ నేందుకు 1,47,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. జిల్లాలోని గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ క్రీడా పోటీల నిర్వహణ కోసం 320 ఆట స్థలాలను సిద్ధ చేశామన్నారు. ఇందులో క్రికెట్‌, వాలీబాల్‌, కోకో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించేందుకు 14,354 టీములను ఏర్పాటు చేసి 7,198 మ్యాచ్‌లను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా 8,670 మంది పురుషులు 4,484 మ్యాచ్‌ల్లో, 5684 మంది మహిళలు 2,714 మ్యాచ్‌ల్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి క్రీడల నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేశామని సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పోటీలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 320 ఆట స్థలాల్లో పోటీల నిర్వహణకు ఇబ్బందులు ఉండకూడదన్నారు. ఆటస్థలాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు ఎప్పటికప్పుడు పారిశుధ్యం నిర్వహించాలన్నారు.ఫ్లెక్సీలు, బ్యానర్లు, మస్కట్లు, తదితర ప్రచార సామగ్రి విస్తతంగా వినియోగించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ క్రీడా సంబరాల్లో భాగంగా క్రికెట్‌ పురుషుల విభాగంలో 2,419 మ్యాచ్‌లకు 1318 టీమలు ఏర్పాటు కాగా, మహిళల విభాగంలో 311 మ్యాచ్‌లకు గాను 108 టీములు ఏర్పాటు చేశామన్నారు. బ్యాడ్మింటన్‌లో పురుషుల విభాగంలో 2,885 మ్యాచ్‌లకు 1,520 టీములు, మహిళల విభాగంలో 3012 మ్యాచ్‌లకు 1,565 టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాలీబాల్‌లో పురుషుల విభాగంలో 1742 మ్యాచ్‌లకు 911 టీములు, మహిళల విభాగంలో 395 మ్యాచ్‌లకు 140 టీములు, కబడ్డీలో పురుషుల విభాగంలో 1235 మ్యాచ్‌లకు 597 టీములు ఏర్పాటు కాగా, మహిళల విభాగంలో 805 మ్యాచ్‌లకు 344 టీములు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఖోఖోలో పురుషుల విభాగంలో 419 మ్యాచ్‌లకు 138 టీములు, మహిళల విభాగంలో 1161 మ్యాచ్‌లకు 547 టీములు ఏర్పాటు చేశారమన్నారు. జెసి లావణ్యవేణి మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

➡️