‘ఆడుదాం ఆంధ్ర’ కిట్లు పంపిణీ

ప్రజాశక్తి-వెలిగండ్ల మండలంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రికెట్‌, టెన్నిస్‌, వాలీబాల్‌, ఖోఖో, ఇతర గేమ్స్‌కు సంబంధించిన కిట్లను సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా జడ్‌పిటిసిల సంఘం అధ్యక్షుడు, వెలిగండ్ల జడ్‌పిటిసి గుంటక తిరుపతిరెడ్డి, మండల పరిషత్‌ అధ్యక్షురాలు రామన మహాలక్ష్మి చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్భంగా జడ్‌పిటిసి గుంటక తిరుపతిరెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాలకు పైబడిన వారందరినీ క్రీడల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం సాధించడం, సంతోషాన్ని పంచుకోవడం సాధ్యమవుతుందన్నారు. క్రీడా సంస్కృతిని విస్తృతం చేసే దిశగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అందుకోసం ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తుందనివ అన్నారు. ఈ నెల 15 నుంచి జరిగే ఆటల పోటీల్లో మండల స్థాయిలో అందరూ పాల్గొని నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతిరెడ్డి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి తాతపూడి సుకుమార్‌, వైసిపి మండల కన్వీనర్‌ గజ్జల వెంకటరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వర్లు, సర్పంచులు గాలి తిరుపతిరెడ్డి, తాతపూడి సురేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శులు విజయ భాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌, షేక్‌ రజియా, పద్మ, గిరిధర్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️