ఆత్మహత్యలపై న్యాయ విచారణ చేపట్టాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు భూ సమస్య కారణంగా ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనపై సమగ్రమైన న్యాయవిచారణ కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని వామపక్ష, రైతు, వ్యవసాయ, కార్మిక, సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారికి వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు జి. చంద్ర, జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామానికి చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు, భార్య పద్మావతి, కూతురు వినయ ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయ విచారణ చేపట్టి మతుని కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌ గ్రేషియ ఇవ్వాలని కోరారు. భూ అక్రమణకు పాల్పడిన అప్పటి తహశీల్దారు, రెవెన్యూ అధికారులను ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించాలని తెలిపారు. ఒంటిమిట్ట మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాలకు గురవుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ ఉన్నత అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. సిీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ నాయకులు బరితెగించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు జిల్లా ఉన్నతాధికారులు అండగా నిలబడాలని, అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, అధ్యక్షులు సుబ్బారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌, అన్వేష్‌, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివ నారాయణ, రైతు సంఘం నాయకులు కట్ట యానాదయ్య, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, సిపిఐ నాయకులు బాదుల్లా, సిపిఐ ఎంఎల్‌ నాయకులు అంకన్న, రవికుమార్‌ పాల్గొన్నారు.సుబ్బారావు కుటుంబాన్ని ఆదుకోవాలి మాధవరంలో త్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవాలని బిసి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమవేశంలో వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామానికి చేనేత కుటుంబానికి చెందిన సుబ్బారావు, భార్య, పద్మావతి,కూతురు వినయ, ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతల పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. న్యాయ విచారణ జరపాలని మతుని కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, భూమి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.30 లక్షల ఎక్స్‌ గ్రేషియ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిఎస్‌పిి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం సరైంది కాదని తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమకు తోచిన ఆర్థిక సాయం అందజేశామని చెప్పారు. మూడు ఎకరాల స్థలాన్ని తిరిగి మతుని కూతురు పేరుతో ఆన్లైన్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, పార్లమెంటు అధ్యక్షులు రామాంజనేయులు, కళ్యాసుధాకర్‌, గోవిందు నాగరాజు, త్రివిక్రమరావు, సుబ్బారావు, ఆదినారాయణ, నరసింహ, సంటెన్న పాల్గొన్నారు.

➡️