ఆదివాసీ మాతృభాష వాలంటీర్ల ర్యాలీ

ర్యాలీ చేస్తున్న ఆదివాసీ మాతృభాష వాలంటీర్లు

ప్రజాశక్తి -కొయ్యూరు

మార్చి, ఏప్రిల్‌ నెలలకు తమను రెన్యువల్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోరుతూ ఆదివాసీ మాతృ భాషా వాలంటీర్లు (ఉపాధ్యాయులు) గురువారం కొయ్యూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కొండ, ఆదివాసీ, ఒరియా భాషల్లో బోధిస్తున్న మాతృ భాష ఉపాధ్యాయులను 2023 ఆగస్టు నుండి 2024 ఫిబ్రవరి వరకు ఏడు నెలలకు మాత్రమే ప్రభుత్వం రెన్యువల్‌ చేసిందని, మార్చి, ఏప్రిల్‌ నెలలకు రెన్యువల్‌ చేయలేదని పేర్కొన్నారు. దీని వల్ల ఈ రెండు నెలల విద్యార్థులు విద్యను కోల్పోవాల్సి వస్తుందన్నారు. తక్షణమే మార్చి, ఏప్రిల్‌ నెలలకు రెన్యువల్‌ చేయాలని, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం నుండి పూర్తిస్థాయిలో కొనసాగించాలని, సమాన పనికి కనీస వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాతృభాష వాలంటీర్లు కుర్ర రమణబాబు, తాంబేలు చిట్టిబాబు, టి.చిరంజీవి, పాంగి చిన్నారావు, మర్రి కాంతమ్మ, పాంగి నాగరాజు, ఎపి ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎస్‌ సూరిబాబు, మండల నాయకులు, మాతృభాష వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️