ఆన్‌లైన్‌ బెట్టింగులు, యా(అ)ప్పులకు విద్యార్థి బలి

Feb 4,2024 00:28

ప్రజాశక్తి-ఈపూరు : ఆన్‌లైన్‌ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకో వడంతోపాటు యాప్‌లో అప్పులు చేసిన డిగ్రీ విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురై ఉరేసుకున్న ఘటన మండల కేంద్రమైన ఈపూరు పంచాయతీ పరిధి ఎర్రగుంట తండాలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు, మృతుని బంధువుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన రామావత్‌ శ్రీరాములు నాయక్‌, దేవిబాయి దంపతుల చిన్న కుమారుడైన బాలస్వామి నాయక్‌ వినుకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఓ పక్క చదువుకుంటూనే పుచ్చకాయల వ్యాపారం చేస్తుంటాడు. సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ రుణాలకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకోవడంతోపాటు, ఆన్‌లైన్‌లో తీసుకున్న అప్పులు చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ విషయమై బంధువుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలస్వామి జనవరి 26వ తేదీ నుండి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండావాసులు చుట్టుపక్కల వాకబు చేసిన ఆచూకీ లభించకపోవడంతో తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం గాలిస్తుండగా దుర్వాసన వచ్చింది. దీంతో అక్కడికెళ్లి పరిశీలించగా చెట్టుకు ఉరితో బాలస్వామి మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహమ్మద్‌ ఫిరోజ్‌ సిబ్బందితో ఘటన ప్రాంతానికి చేరుకొని వివరాల మేరకు కేసు నమోదు చేసి ప్రభుత్వ వైద్యులను పిలిపించి పోస్టుమార్టం నిర్వహించారు.

➡️