ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి: మారెళ్ల సుబ్బారావు

ప్రజాశక్తి-ఒంగోలు ఆపదలో ఉన్నవారిని మానవతా హృదయంతో ఆదుకోవాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు అన్నారు. గురువారం సూర్యశ్రీ దివ్యంగుల చారిటబుల్‌ ట్రస్ట్‌ సెక్రెటరీ షేక్‌ సర్దార్‌ బాషా ఆధ్వర్యంలో కష్టాల్లో ఉన్న ఒక దివ్యాంగురాలిని ఆదుకున్నారు. వివరాల్లోకెళితే.. దొనకొండ మండలం సంగాపురం గ్రామంలో నివసిస్తున్న దివ్యాంగురాలు ఇప్పిలి కనకలక్ష్మిని ఆటో డ్రైవర్‌ యాక్సిడెంట్‌ చేయడం వలన కుడికాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నది. వైద్యులు కాలు ఆపరేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ట్రీట్మెంట్‌కు డబ్బులు లేక ఇబ్బంది పడుతోంది. ఈమె భర్త మున్నయ్య పుట్టుగుడ్డివాడు. వీరికి గతంలో సూర్య శ్రీ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వివాహం కూడా జరిపించారు. గతంలో ఈ దంపతులకు జీవనోపాధికి చిల్లర దుకాణం ఏర్పాటు చేశారు. ఇప్పుడు కనకమహాలక్ష్మికి కాలు ఆపరేషన్‌కు దాతల సహకారంతో సర్దార్‌ భాషా, మారెళ్ల సుబ్బారావుల చేతుల మీదుగా 43 వేల రూపాయలు అందచేశారు. ఈ సందర్భంగా మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ.. దివ్యాంగురాలు కనకలక్ష్మి కాలు తీసేసి పరిస్థితిలో సర్దార్‌ సంప్రదించి తన బాధని వ్యక్తం చేశారని, వెంటనే స్పందించి మానవత్వంతో దాతలు మండవ గీత రూ.22 వేలు, బొబ్బూరి సురేష్‌ రూ.12,300, సుమంత్‌ బొద్దులూరి 10 వేల రూపాయల సహకారంతో కాలు ఆపరేషన్‌ చేయించారని తెలిపారు. సర్దార్‌ బాషా మాట్లాడుతూ దివ్యాంగులు మునయ్య కనకలక్ష్మి దంపతులకు ట్రస్ట్‌ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

➡️