ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు

Dec 18,2023 23:27
ఆరోగ్యశ్రీ

కలెక్టర్‌ మాధవీలత
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం మెగా ఆరోగ్యశ్రీ అవగాహన జిల్లా స్థాయి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజల్లో ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో నూతనంగా కార్డుల పంపిణీ, కర పత్రాలు అందిస్తామన్నారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పెంచారన్నారు. ఈ పథకంపై ప్రజలకు ఎటువంటి సందేహాలు రాకుండా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇంటింటా ప్రచారం చేస్తామన్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల పొందుతున్న మధ్యతరహా కుటుంబాలకూ ఈ పథకం వర్తిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి మొబైల్‌లో దిశా యాప్‌, ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. సంబంధిత యాప్‌లో కుటుంబ సభ్యులకు సంబంధించిన వైద్యంపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. వైసిపి అధికారంలోకొ చ్చినప్పుడు 1,057 రకాలకు మాత్రమే వైద్య సేవలు అందిస్తే నేడు వాటిని 3,257 రకాల రోగాలకు వైద్యం అందిస్తుందన్నారు. గతంలో కేవలం 750 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉంటే నేడు 2,513 నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎస్‌పి పి.జగదీష్‌ మాట్లాడుతూ దిశా యాప్‌ను డౌన్లోడ్‌ చేసిన క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేస్తూ, ఆరోగ్యశ్రీ యాప్‌నూ డౌన్‌లోడ్‌ చేయిస్తామన్నారు. ఆ మేరకు పోలీస్‌ సిబ్బందికి సూచనలు జారీ చేస్తామన్నారు. డిసిసిబి చైర్మన్‌ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీను మరింత అప్‌గ్రేడ్‌ చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌ కుమార్‌, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. చాగల్లు : తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండలంలోని పిహెచ్‌సి అధికారులు, సిబ్బంది ఎంపిడిఒ కార్యాలయంలో, సచివాలయాల వద్ద పాల్గొన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని సిఎం జగన్‌ సోమవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తారన్నారు. కొత్తవారికీ ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తారన్నారు. ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసి కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉండ్రాజవరం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా భావించిన డాక్టర్‌ వైస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ను సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొత్త ఫీచర్‌లతో లాంఛనంగా ప్రారంభించాని పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌ తెలిపారు. ప్రారంభం కార్యక్రమాన్ని పాలంగి పంచాయతీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించిన అనంతరం ఆయన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వి నాగమణి, ఎంపిహెచ్‌ఎ ఎం.కాపానాగరాజు, పద్మ, ఆశాలు పాల్గొన్నారు.

➡️