ఆర్‌టిపిపిలో భూ నిర్వాసితు ఉద్యోగాలపై నీలినీడలు

పరిశ్రమలు వస్తే అభివద్ధికి పునాదులు పడినట్లే అని..నిరుద్యోగ సమస్య పోతుందని నిరుద్యోగులు ఆశతో ఉంటారు. కానీ పాలకులు తమ పలుకుబడితో స్థానికే తరులకు అవకాశం కల్పిస్తే… నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది. అభివద్ధి ఆమడ దూరంలోకి వెళుతుంది. భూమిని నమ్ముకొని జీవనం సాగించే అన్నదాతలు…భూమి పరిశ్రమకు పోతే ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. కూలీలుగా అదే పరిశ్రమలో ఉండాల్సిన దుస్థితి..ప్రజాశక్తి – ఎర్రగుంట్ల జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామం వద్ద రాయలసీమ తాప విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని (ఆర్‌టిపిపి) 1988 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారు. అనేక ఉద్యమాల ఫలితంగా రాయలసీమలో ఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ఎన్టీఆర్‌ రూ. 504 కోట్ల వ్యయంతో 2ఐ210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో శంకుస్థాపన చేశారు. అనేక బాలారిష్టాలను అధిగమించి నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆర్‌టిపిపి మొదటి దశ 1995 నవంబర్‌ 29న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. అనంతరం ఆర్‌టిపిపి సామర్థ్యాన్ని మరింత పెంచుతూ 2ఐ210 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన రెండో దశకు 2004 ఫిబ్రవరి 21న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుమారు రూ. 1640 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న రెండోదశను సింక్రనైజేషన్‌ చేయడానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మూడవదశ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. మూడవ దశలోని ఐదవ యూనిట్‌ 210 మెగా వాట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంది. దీంతో ఆర్‌టిపిపి మొత్తం 1050 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఆర్‌టిపిపిలో మూడు దశల్లోనీ ఐదు యూనిట్లలో1050 మెగావాట్ల విద్యుత్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండగా.. ఆరవ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు 2004 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశే ఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 3500 కోట్ల వ్యయంతో 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆరవ యూనిట్‌ 2010 సంవత్సరంలో నిర్మాణం వైపు అడుగులు పడ్డాయి. దీని నిర్మాణం బాలారిస్టల్లోనే కొనసాగింది. సుమారు 544 ఎకరాల భూమిని కలమల్ల, సున్నపురాలపల్లె గ్రామాల రైతుల వద్ద నుంచి ఎపి జెన్‌ కో కొనుగోలు చేసింది. ఇందుకు సుమారు 400 మంది భూ నిర్వాసితులు ఉన్నారు. భూములు కోల్పోయిన వారికి కల్పించాల్సిన ఉద్యోగ భద్రతలో జెన్‌ కో నిర్లక్ష్యం చేస్తోందని బాధితులు వాపోతున్నారు. 2015లో సింక్రనైజేషన్‌ చేసిన సమయంలో కేవలం 80 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, ఇంకా 110 మంది భూ నిర్వాసితులు ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌టిపిపిలో సుమారు 268 జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిని అర్హత కలిగిన భూ నిర్వాసితులకు ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సొంత నియోజక వర్గంలోని 39 మందికి వయసుతో నిమిత్తం లేకుండానే ఆర్‌టిపిపిలో జెపిఎ (జూనియర్‌ ప్లాంట్‌ అసిస్టెంట్‌)ఉద్యోగాలు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. నెల్లూరులోని థర్మల్‌ ప్లాంట్లో కాంట్రాక్ట్‌ కార్మికులుగా పనిచేస్తున్న వీరిని జీవో -69 పేరుతో తీసుకొచ్చి ఆర్‌పిపిలో ఉద్యోగాలు ఇచ్చారని భూ నిర్వాసితులు వాపోయారు. న్యాయ బద్దంగా తమకు రావాల్సిన ఉద్యోగాలు స్థానికేతరులకు ఇవ్వడంపై ఆందోళన బాట పట్టడానికి సిద్దం అవుతున్నామని బాధిత భూ నిర్వాసితులు తెలిపారు. నీలి నీడలు కమ్ముకున్న భూ నిర్వాసితుల ఉద్యోగాలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకావాలని వారు విన్నవిస్తున్నారు.

➡️