ఆర్నెల్లకోసారి ఆరోగ్య సురక్ష

Jan 10,2024 21:28

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  :  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఆర్నెల్లకోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జెఎఎస్‌ జిల్లా ప్రత్యేకాధికారి ఎస్‌.వెంకటేశ్వర్‌ తెలిపారు. పట్టణంలోని చాకలిబెలగాంలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష (జెఏఎస్‌) వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. జెఎఎస్‌ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శిబిరానికి హాజరైన రోగులతో ఆయన మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. గర్భిణులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందులను కేంద్ర డ్రగ్‌ స్టోర్‌ నుంచి గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించి అక్కడి నుండి బాధితులకు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి మంగళ, శుక్రవారాలు మండలాల్లో, ప్రతి బుధవారం పట్టణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగనన్న సురక్ష సురక్ష కార్యక్రమంలో మొదటి దఫాలో జిల్లాలో 292 శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నేత్ర తనిఖీలు నిర్వహించి, అవసరమైన వారికి కేటరాక్ట్‌ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.25 లక్షలకు ఆరోగ్యశ్రీ కవరేజీజగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షలకు కవరేజీ పెంచినట్లు ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయివేట్‌ ల్యాబ్‌లలో సైతం స్కానింగ్‌ వంటి సేవలు పొందవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి విష్ణు చరణ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి.జగన్నాథరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వాగ్దేవి, ఆర్‌బిఎస్‌కె ప్రాజెక్టు అధికారి ధవళ భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి ఎం.వినోద్‌, డిఐఒ ఎం.నారాయణరావు, ఎన్‌జిఒ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు జివిఆర్‌ఎస్‌ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి జిల్లాలో వైద్య శాఖలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లుకు ఎపి ఎన్‌జిఒ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు జివిఆర్‌ఎస్‌ కిశోర్‌ ఆధ్వర్యంలో వినతి అందించారు. గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న నర్సింగ్‌, పారా మెడికల్‌, మినిస్టీరియల్‌, ఎన్‌హెచ్‌ఎంలో పనిచేస్తున్న వారికీ ట్రైబల్‌ వెయిటేజ్‌, ట్రైబల్‌ అలోవెన్స్‌ ఇవ్వాలని రెగ్యులర్‌ కోరారు. స్పందించిన డైరెక్టర్‌ ట్రైబల్‌ వెయిటేజ్‌ ఉత్తర్వులు 15 రోజుల్లో ఇస్తానని హామీ ఇచ్చారు. ట్రైబల్‌ అలవెన్స్‌ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎపి వైద్య విధాన పరిషత్తు నాయకులు విపి చంద్ర సాయి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ అసోసియేషన్‌ నాయకులు పాల్గొన్నారు.

➡️