ఇపిఎఫ్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Dec 20,2023 23:38
ఇపిఎఫ్‌ పెన్షనర్ల

ప్రజాశక్తి – కాకినాడ

ఇపిఎఫ్‌ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఎపిఆర్‌పిఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు డిమాండ్‌ చేశారు. ఆలిండియా కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఇపిఎఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు బుధవారం స్థానిక బోట్‌ క్లబ్‌ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇపిఎఫ్‌ పెన్షనర్లు దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉన్నప్పటికీ వారిలో 35 లక్షల మందికి కనీస పెన్షన్‌ వెయ్యి రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇపిఎఫ్‌ఒ వద్ద ఉన్న తమ జీతాల నుంచి చెల్లించిన మొతంపై రూ.50 వేల కోట్లు వడ్డీగా వస్తుందని అన్నారు. అందులో ఇపిఎఫ్‌ఒ కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే పెన్షనర్లకు పెన్షన్‌ రూపంలో చెల్లిస్తుందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్‌ చెల్లిస్తానన్న హామీ నేటికి అమలు జరపలేదన్నారు. పెన్షనర్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే నిర్లక్ష్య ధోరణికి నిరసనగా రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ఓడించే దానికి పెన్షనర్లు సిద్ధంగా ఉండాలని సత్తిరాజు పిలుపు ఇచ్చారు. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి టి.శివదాసుకి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కోశాధికార సిహెచ్‌.సత్యనారాయణ రాజు, కర్రి బాబూరావు, బి.వీరభద్రరావు, మోహనమురళి, యుఎస్‌ఎన్‌.రెడ్డి, బి.అశోక్‌, జోగా అప్పారావు, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.

➡️