ఇరిగేషన్‌ భూమిపై కన్ను

Feb 29,2024 21:36

ప్రజాశక్తి – గరుగుబిల్లి : మండలంలోని ఖడ్గవలస, ఎర్రగుడి జంక్షన్‌ వద్ద ఆక్రమణలు జరిగే శాశ్వత నిర్మాణాలు చేపట్టిన విషయం అధికారులకు తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో అధికారులు పలుమార్లు ఆక్రమణదారులకు నోటీసులు మంజూరు చేసినప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతో ఆ నోటీసులు చిత్తుకాగితాలకే పరిమితమైపోతున్నాయి. ఇటీవల కాలంలో ఉల్లిభద్ర వద్ద తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుండి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ సెంటర్‌ మెయిన్‌ గేట్‌ వరకు ఉన్న నీటిపారుదలశాఖ భూములపై కబ్జాదారులు కన్ను పడింది. దీంతో భూముల్లో కబ్జాదారులు తమకు అనుకూలమైన ప్రదేశంలో మట్టి, డిబిస్‌తో చదును చేస్తున్నారు. గతంలో ఇలాగే మొతటి చదును చేసి ఆ తర్వాత నిర్మాణాలను ప్రారంభించి వాటి విక్రయించేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి చదునులోనే ఉన్నందున అధికారులు ఆదిలోనే అడ్డువేయాలని, లేకుంటే మొత్తం భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకునే నాధుడే లేడా?పాలకొండ నుండి పార్వతీపురం వెళ్లే రహదారికి అనుకొని తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అలాగే డాక్టర్‌ వైయస్సార్‌ హార్టికల్చర్‌ గేటుకు మధ్య గల నీటిపారుదలశాఖకు చెందిన సుమారుగా 3 ఎకరాల భూమి ఉంది. ప్రజాప్రతినిధుల అండదండలతో ప్రభుత్వ స్థలం కబ్జా చేయడం కొందరు పనిగా పెట్టుకొని వారసత్వ ఆస్తులు మాదిరిగా విక్రయాలు చేయడం పనిగా మారిపోయింది. ఇరిగేషన్‌శాఖకు సంబంధించిన ఆస్తులు ఎర్రన్న గుడి జంక్షన్‌ వద్ద నుండి తోటపల్లి కుడి ప్రధాన కాలువ వరకు కొంత భాగం ఆక్రమణ జరిగి శాశ్వత నిర్మాణాలు జరిగిన విషయం అధికారులకు తెలిసినా, అంగుళం కూడా కదపలేని పరిస్థితి. ఈ ఆక్రమణల పట్ల అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవు.నీటిపారుదలశాఖకు సంబంధించిన స్థలాలైన ఎర్రన్నగూడ జంక్షన్‌ వద్ద ఆక్రమణదారులకు గతంలో నాలుగు సార్లు నోటీసులు జారీ చేశాం. అయినా వారు ఏమీ పట్టినట్లు విచ్చలవిడిగా ఇరిగేషన్‌ స్థలాన్ని ఆక్రమిస్తున్నట్టు తెలిసింది. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తప్పవు. యంత్రాలతో తొలగించక ముందే అక్రమదారులు తమ ఆక్రమణలను తొలగించాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.కిశోర్‌, ఇరిగేషన్‌ ఎఇ.

➡️