రామకృష్ణారెడ్డి అరెస్టు తొలిఅడుగే

Jun 28,2024 23:39

జీవీ ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్‌
ప్రజాశక్తి – వినుకొండ :
ప్రశాంత పల్నాడు కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు తొలి అడుగు మాత్రమేనని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పల్నాడును సొంత జాగీరుగా, మాఫియా అడ్డాగా చేసుకున్న రౌడీమూక ఆటకట్టిందని, పచ్చనిపల్లెల్లో ఫ్యాక్షన్‌ నెగళ్లు ఎగదోసిన ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. అరాచాక వైసిపి పాలన పోవడంతో శాంతిభద్రతలకు తిరిగి మంచిరోజులు వచ్చాయని, పోలీసులు తమ పని తాము చేసుకోవచ్చని పిన్నెల్లి అరెస్టుతో స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైందని పేర్కొన్నారు. అయిదేళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నో నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారని, వాటన్నింటికీ శిక్షలు పడితే జీవిత కాలం అతడు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు. రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా త్వరలో ఊచలు లెక్కించడం ఖాయమన్నారు. మైనింగ్‌ అక్రమాలు, సహజవనరుల లూటీతో పాటు మాచర్ల నియోజకవర్గం మొత్తం వ్యాపారులు, సామాన్యులు బెదిరించి రామకృష్ణారెడ్డి చేసిన ఘోరాలపైనా సమగ్ర దర్యా ప్తు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక్కమాచర్ల నియోజకవర్గంలోనే పిన్నెల్లి గడిచిన ఐదేళ్లలో రూ.2 వేల కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. అతడి వల్ల నష్టపోయిన స్థానిక బాధితులు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి తమ బాధలు చెప్పుకోవచ్చని సూచించారు. టిడిపి శ్రేణులపై పిన్నెల్లి సోదరులు సాగించిన మారణకాండపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నడిరోడ్డుపై గొంతుకోసి చంపిన టిడిపి కార్యకర్త తోట చంద్రయ్యకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాశక్తి – బెల్లంకొండ : ఐదేళ్ల వైసిపి పాలనలో రాజకీయ హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో అరాచకాలకు కేరాఫ్‌ మారిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడం శుభపరిణామమని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ అన్నారు. సహజ వనరులను నిలువునా దోచుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడు గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని, ఆయనపై 14 కేసులున్నా ఇప్పటివరకు శిక్ష పడకుండా తప్పించుకు తిరిగాడని విమర్శించారు. ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈవీఎం ధ్వంసం ఆయన అరాచకాలకు ప్రత్యక్ష సాక్ష్యమని, వెలుగులోకి రాని ఘటనలు వందల సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఆయన అక్రమాలకు సహకరించిన అధికారులు, పోలీసులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలరు.

➡️