ఇళ్లను ఎమ్మెల్యే కూల్చేయిస్తున్నారు..

ఆర్‌డిఒకు వినతిపత్రం ఇస్తున్న క్రిస్టియన్‌పాలెం వాసులు
ప్రజాశక్తి – నరసరావుపేట : తమ ఇళ్లను ఎమ్మెల్యే కూల్చేయించి ఆ స్థలాలను ఆక్రమిస్తున్నారని పట్టణంలోని క్రిస్టియన్‌పాలెం వాసులు వాపోయారు. ఈ మేరకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆర్‌డిఒ శేషిరెడ్డికి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత మహిళల మాట్లాడుతూ ఓట్లేసి ఎమ్మెల్యేను గెలిపించుకుంటే ఆయనే తమ ఇల్లను జెసిబిలతో పడేసి చదును చేస్తున్నారని, ఎమ్మెల్యే అనుచరులు అక్కడే టెంట్లు వేసుకుని మద్యం తాగుతూ అటుగా ఎవరైనా వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పారు. దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. అరవింద్‌బాబు మాట్లాడుతూ పట్టణంలోని 4, 5వ వార్డులోని క్రిస్టియన్‌పాలెం, పలు ప్రాంతాల్లో పేదలు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు వాటిని కూల్చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ పట్టాలున్నా లెక్కజేయడం లేదని, క్రిస్టియన్‌పాలెం సమీపంలో పేదలు గుడిసెలు వేసుకున్న 22 సెంట్లతో పాటుగా పక్కనే ఉన్న నాలుగున్నర ఎకరాలనూ ఆక్రమించుకుంటున్నారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యే దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని, వాటిని ఎకరా రూ.5 కోట్ల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు వి.సింహాద్రి యాదవ్‌, ఎం.రామారావు, కె.వెంకటేశ్వర్లు, రమేష్‌, బాష, జాకీర్‌ పాల్గొన్నారు.

➡️