ఇళ్ల స్థలాల అక్రమాలపై చర్యలు తీసుకోండి

Dec 9,2023 21:47

ప్రజాశక్తి-బొబ్బిలి  :  మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, బొబ్బిలి, బాడంగి మండలాల కార్యదర్శులు ఎస్‌.గోపాలం, ఎ.సురేష్‌ డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ కాలనీలో ఆక్రమణకు గురైన ఇళ్ల స్థలాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో అధికార పార్టీకి చెందిన వార్డు ఇన్‌ఛార్జి ఇళ్ల స్థలాలను ఆక్రమించేసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల స్థలాలు అక్రమాలపై దర్యాప్తు చేసిన రెవెన్యూ అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేవడంతో అర్ధాతరంగా దర్యాప్తు నిలిపివేశారని మండిపడ్డారు. గతంలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేయకపోవడంతో ఆ స్థలాలను రద్దు చేసినట్లు గృహ నిర్మాణ శాఖాధికారులు చెప్పారని, ఆ స్థలాలను ఇప్పుడు కాలనీకి చెందిన కొంతమందితో కలిసి ఆక్రమించేసి ఒక్కొక్కటి రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఇళ్ల స్థలాల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️