ఈ-క్రాప్‌లో నమోదు చేయని పంటలకూ పరిహారమివ్వాలి

సమావేశంలో మాట్లాడుతున్న వై.రాధాకృష్ణ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
మిచౌంగ్‌ తుపానుతో మిర్చి, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటలతోపాటు ఉద్యాన పంటలు సాగు చేపట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం దక్కుదుంతనే భరోసా ప్రభుత్వం కల్పించాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ కోరారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సోమవారం కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు కె.రామారావు అధ్యక్షత వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ పంటలు సాగుచేసిన రైతులలో 70 శాతం పైగా కౌలు రైతులు ఉన్నారని, ముందస్తు కౌలు చెల్లించి రకరకాల పంటలు సాగు చేశారని చెప్పారు. కౌలు రైతులకు నామమాత్రపు పరిహారం కాకుండా క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి పూర్తి నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహా రుణ విమోచన చట్టాన్ని అమలు చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలను సమావేశం ఆమోదించింది. ఈ-క్రాప్‌లో నమోదు చేయని పంటలకూ పరిహారం చెల్లించాలని, పరిహారం నేరుగా కౌలు రైతులకే ఇవ్వాలని, పంట నష్టపరిహారాన్ని పెరిగిన ఇన్‌ పుట్స్‌ ధరలకు అనుగుణంగా పెంచాలని, అన్ని పంటలకు దిగుబడుల ఆధారిత పంటల బీమాను అమలు చేయాలని, ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఆర్‌.బి.కెల ద్వారా ఉచితంగా ఇవ్వాలని, పత్తి, ధాన్యం పంటలను నిబంధనలను సడలించి కనీస మద్దతు ధరలకు ప్రభుత్వం కొనుగోలు డిమాండ్లతో తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో హనుమంతరావు, పిచ్చారావు, లక్ష్మీనారాయణ, తాతారావు, మేరమ్మ, ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️