ఉత్తేజంగా ఎస్‌ఎఫ్‌ఐ మహాసభ

ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ

కాకినాడలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభ రెండోరోజైన గురువారం ఉత్తేజకరంగా సాగాయి. పలువురు ముఖ్యఅతిథుల ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పోరాట స్ఫూర్తిని నింపాయి. అలాగే పలువురు సౌహార్ధ సందేశాలు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. రెండోరోజు పలు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. …ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ రెండోరోజు రెట్టింపు ఉత్సాహంతో సాగింది. మొదటి రోజుకు కొనసాగింపుగా రెండోరోజు ఉదయం పలు జిల్లాల ప్రతినిధుల ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయా జిల్లాల్లో చేపట్టిన ఉద్యమాలు, ఫలితాలను వివరించారు. ఈ సమయంలో వారు నిర్బంధానికి గురికావడం, జైలుపాలవ్వడం వంటి ఘటనలను ఉదహరించారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి చేసిన కార్యక్రమాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ముఖ్యఅతిథులు మాట్లాడారు. తొలుత కష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడారు. విద్యారంగంలో వినాశకర విధానాలు అమలవు తున్నాయన్నారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న తాను 1972-82 మధ్యకాలంలో ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేసే అనేక సమస్యలపై పోరాడామన్నారు. గుంటూరులో అధ్యాపకునిగా వృత్తి నిర్వహించి మూడో సారి ఎంఎల్‌సిగా పనిచేస్తున్నామన్నారు. ఈ కాలంలో నిబద్ధత, నిజాయితీగా పనిచేస్తున్నానని ఇందుకు ఎస్‌ఎఫ్‌ఐ నేర్పిన విలువలే కారణమన్నారు. ప్రజా సమస్యల పట్ల, జీవితంలో విలువలతో ఎలా బతకాలో నేర్పిందన్నారు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుకుదేవ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, సుందరయ్య వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కషి చేస్తుందని కొనియాడారు. విద్యలో ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ బాగా పెరిగిందన్నారు. కొఠారి కమిషన్‌ ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని సూచించిందన్నారు. కాని నేడు అలా జరగట్లేదన్నారు. ఎన్‌ఇపిని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో వినాశకర సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. పాఠశాలల మెర్జ్‌తో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. వైసిపి అధికారంలో ఒక్క డిఎస్‌సి కూడా తీయలేదన్నారు. యూనవర్శిటీల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎయిడెడ్‌ కళాశాలలను గత, ప్రస్తుత ప్రభుత్వాలు నాశనం చేశాయన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు భవిష్యత్తులో ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టబోయే అన్ని ఉద్యమాలకు పిడిఎఫ్‌ గా తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని లక్ష్మణరావు ఈ సందర్భంగా తెలిపారు. ఆకట్టుకున్న పిఎన్‌ఎం కళారూపాలుకాకినాడ జిల్లా పెద్దాపురం ప్రజానాట్యమండలి కళాకారులు దారపురెడ్డి కృష్ణ, సత్యనారాయణ, వీర్రాజు, అప్పన్న, రాంబాబు ఆధ్వర్యంలో ప్రదర్శించిన వివిధ కళారుపాలు ఆకట్టుకున్నాయి. ‘ఎక్కడమ్మా నీవు లేనిది..ఏమిటి నీవు చేయలేనిది’, ‘నా చెమట చుక్కా నా చెమట చుక్కా’ అంటూ పిల్లలు ప్రదర్శించిన నృత్య రూపకం ఆలోచింపజేసింది. సుమారు గంట పాటు ప్రదర్శించిన ”పల్లె సుద్దులు” ఉత్సాహంగా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు పెంచి ప్రజలను ఎలా మోసాగిస్తున్నాయో, బిజెపి సర్కారు విద్యలో కాషాయీకరణను తీసుకొస్తూ విద్యా రంగాన్ని ప్రమాదంలో ముంచెత్తుతున్న విధానాన్ని వివరించారు. ఓటు హక్కు విలువను తెలియజేస్తూ పల్లె సుద్దులు చెప్పారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు అమృత, సమ్రత, పూజిత, అఖిల, నిఖిల, ధరణి, అరుణ్‌ బంగారు రాజు,గౌస్‌, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.16 జిల్లాల నుంచి 347 మంది ప్రతినిధుల హాజరుమహాసభకు 16 జిల్లాల నుంచి 347 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 283 మంది ప్రతినిధులు అర్హత పత్రాల ఇచ్చారు. అందులో మండలాల నుంచి 103, టౌన్‌ల నుంచి 85, సీటీల నుంచి 63 మంది, జిల్లా కేంద్ర నుంచి 32 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభకు హాజరైన ప్రతినిధుల్లో అత్యధికంగా 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు 101 మంది, 19 నుంచి 20 ఏళ్ల వయస్సు వారు 57 మంది, 23 ఏళ్ల లోపు వారు 75 మంది, 25 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు 41 మంది, 30 ఏళ్లకు పైగా ఉన్నవారు ముగ్గురు ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన స్వేచ్ఛ(12 ఏళ్ళు) అత్యంత పిన్నవయస్కురాలు. సమ్మెకు మద్దతుపై కృతజ్ఞతలుఅంగన్‌వాడీల సమ్మెకు మద్దతు ఇస్తూ ఎస్‌ఎప్‌ఐ రాష్ట్ర మహాసభ తీర్మానం చేసినందుకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబీరాణి కృత జ్ఞతలు తెలిపారు. మహాసభలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని రోడ్డెక్కి అంగన్‌వాడీలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. వేతనాలు పెంచడానికి డబ్బు లేదని చెబుతున్న పాలకులు, సలహాదారుల పేరుతో పెద్ద ఎత్తున సొమ్ములను దుర్వినియోగం చేయడం లేదా అని ప్రశ్నించారు. ఎన్‌ఇపి విద్యార్తులకే కాదు అంగన్‌వాడీలకు కూడా నష్టమేనన్నారు. ఎన్‌ఇపి కారణంగా అంగన్‌వాడీ సెంటర్లను విలీనం చేస్తున్నారన్నారు. ఎన్‌ఇపికి వ్యతిరేకంగా విద్యార్థులు, అంగన్‌వాడీలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

➡️