ఉత్సాహభరితంగా ‘ఆడుదాం-ఆంధ్రా’ ప్రారంభం

ఏలూరు:నగరంలోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో మంగళవారం అడుదాం ఆంధ్రా’ కార్యక్రమం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలుత కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌, ఎస్‌పి మేరీ ప్రశాంతి, జెసి లావణ్యవేణి, మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. క్రీడా జ్యోతిని వెలిగించి, బెలూన్లు గాలిలోకి ఎగురవేసి ఆడుదాం ఆంధ్రా క్రీడాసంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 47 రోజులపాటు 625 సచివాలయాల పరిధిలో 1,47,000 మంది ఆటలు ఆడేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ పోటీల్లో 14,354 టీములు 7198 మ్యాచ్‌ల్లో పాల్గొంటారన్నారు. ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండేందుకు క్రీడలు ఎంతోదోహదపడతాయన్నారు. ప్రతీ సచివాలయ పరిధి నుండి సుమారు 200 మంది చొప్పున ఈ క్రీడోత్సవాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయస్థాయి నుంచి ఐదు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించబడతాయన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్‌ ఫోన్లకు పరిమితమై అందులోనే క్రికెట్‌, ఫుట్‌బాల్‌ వంటి ఆటలకు పరిమితమవుతున్నారని, దాని నుండి బయటపడి క్రికెట్‌ మైదానాలకు వచ్చి ఆటల్లో పాల్గొని తమలోని క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలని ఆయన హితవు పలికారు. మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ యువతను క్రీడల్లో ప్రోత్సహించే దిశగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు సిఎం జగన్‌ గొప్ప సంకల్పంతో ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాలను నిర్వహిస్తున్నారన్నారు. ఏలూరు నగరంలో 79 సచివాలయాల పరిధిలో 14,914 మంది క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారన్నారు. వీరంతా తమ ప్రతిభను కనబరచి జిల్లా, రాష్ట్రస్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఎస్‌పి మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో మొదటిసారిగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడాస్ఫూర్తి కూడా ప్రతిఒక్కరిలోనూ ఉండాలన్నారు. క్రీడల్లో రాణించి ఎంతోమంది విద్య ఇతర రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదిగారన్నారు. అంతర్జాతీయ క్రీడాకారిణి డి.మాధవి మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడాసామర్థ్యం ఇమిడి ఉందని, అక్కడ ఎందరో ఆణిముత్యాలు దాగి ఉన్నారన్నారు. అలాంటి వారిలో క్రీడాప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి అడుదాం-ఆంధ్రా క్రీడా సంబరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామస్థాయిలో పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంచేందుకు పిఇటిలు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌ కృషి చేయాలన్నారు. తాను ప్రస్తుతం ఇండియన్‌ రైల్వేలో కోచ్‌గా ఉన్నందుకు గర్విస్తున్నానని తెలిపారు. రంజీ మాజీ క్రికెటర్‌ ఎఫ్‌ఎం.రెహ్మాన్‌ మాట్లాడుతూ 30 ఏళ్లల్లో గ్రామస్థాయి నుంచి క్రీడాటోర్నమెంట్లు నిర్వహించడం చూడలేదని ప్రస్తుతం ఇలాంటివి నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్రా జిల్లా అంబాసిడర్స్‌ డి.మాధవి, రెహ్మాన్‌, ఎం.వెంకట మురళీకృష్ణ ఎ.శ్రీనివాసరావు, డి.ప్రసాద్‌, నగరపాలక సంస్థ కోఆప్షన్‌ సభ్యులు ఎస్‌ఎంఆర్‌.పెదబాబు, మున్నుల జాన్‌, కార్పొరేటర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, జెడ్‌పి సిఇఒ కె.సుబ్బారావు, హౌసింగ్‌ పీడీ కె.రవికుమార్‌, డిఎస్‌ఒ బి.శ్రీనివాసరావు, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారి వినాయకప్రసాద్‌, డిఇఒ శ్యామ్‌ సుందర్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సాల్మన్‌రాజు, తహశీల్దార్‌ బి.సోమశేఖర్‌, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మాలతి క్రీడాకారులు పాల్గొన్నారు.జిల్లా తరపున ఆడుదాం ఆంధ్రా అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న హ్యాండ్‌ బాల్‌ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఏలూరుపాడుకు చెందిన డి.మాధవి, ఆంధ్రా రంజీ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎఫ్‌.రెహ్మాన్‌, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ ఎం.వెంకటమురళీకృష్ణ, వెయిట్‌ లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో రాణించిన ఎ.శ్రీనివాసరావు, అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో రాణించిన డి.ప్రసాద్‌ను సత్కరించారు.తొలుత పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, కూచిపూడి, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

➡️