ఉద్యోగుల బకాయిలు తీర్చకపోవడం అన్యాయం

విశాఖలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న దృశ్యం

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌

ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18 వేలా 96 కోట్లును చెల్లించకపోవడం ఎలాంటి న్యాయమో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని యుటిఎఫ్‌ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఆర్‌.అంబేద్కర్‌ ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆయా బకాయిలను నేటికీ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ప్రతి నెలా 1న జీతాలు చెల్లించాలని, 12వ పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ కమిటీ విధి విధానాలు వెల్లడించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్యపెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పిఆర్‌సి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బకాయిలను విడుదల చేయని పక్షంలో ఈ నెల 24న జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షులు అనకాపల్లి పైడిరాజు, సహధ్యక్షులు రొంగలి ఉమాదేవి, జిల్లా కోశాధికారి కె.రాంబాబు, జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రియాజ్‌ అహ్మద్‌, టి.జగన్‌, సీనియర్‌ నాయకులు ఊడికల రాంబాబు, భీమిలి ప్రధాన కార్యదర్శి టి.రాజు, చినగదిలి అధ్యక్షులు ఎన్‌.ప్రసాద్‌, సత్యనారాయణ, శోభ, హాక్‌, రామేశ్వరి పాల్గొన్నారు. అనకాపల్లి : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18,096 కోట్లు వెంటనే చెల్లించాలని, 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని కోరుతూ ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం అనకాపల్లి పట్టణంలో నెహ్రూ చౌక్‌ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బారు మాట్లాడుతూ యుటిఎఫ్‌ ఆందోళన ఫలితంగా పిఎఫ్‌ బకాయిలు కొంత చెల్లించినప్పటికి, మిగిలిన బకాయిల సంగతేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఓపిఎస్‌ అమలు చేయాలని, మిగిలిన పిఆర్‌సి, డిఎ, పిఎఫ్‌, ఏపీ జిఎల్‌ఐ బకాయిలు వెంటనే చెల్లించాలని, మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, కోశాధికారి జోగా రాజేష్‌, కార్యదర్శి శేషుకుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ మారిశెట్టి వెంకటప్పారావు, సీనియర్‌ నాయకులు జీకేఆర్‌ స్వామి, దేముడునాయుడు, సుభాషిణిదేవి, కామరాజు, సలీం, బండారు శంకర్‌, ఈశ్వర్‌, రవి, తేజ్‌ వర్ధన్‌, నూతన్‌ తదితరులు పాల్గొన్నారు.నర్సీపట్నం టౌన్‌: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలని యుటిఎఫ్‌ నర్సీపట్నం డివిజన్‌ నాయకులు నల్ల రిబ్బన్లు కట్టుకొని స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ డివిజన్‌ నాయకుడు జంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ రుణాలు, సరెండర్‌ లీవ్స్‌, పెండింగ్‌ డిఏ, అరియర్స్‌, పిఆర్సి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు నాయుడు, చిట్టయ్య, అడిగర్ల సత్యనారాయణ, జల్లూరు ప్రసాదు, జేవీ నర్సింగరావు, సాంబమూర్తి, లోవరాజు, స్పర్జన రాజు, ఈశ్వర వర్మ తదితరులు పాల్గొన్నారు

➡️