ఉపాధి పనులు కల్పించాలని ధర్నా

Feb 12,2024 21:07

ప్రజాశక్తి – పార్వతీపురం : ఉపాధిహామీ పనులు కల్పించాలని వెలగవలస పంచాయతీ పరిధిలోని గ్రామాల గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద గిరిజన, వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యాన సోమవారం ధర్నా చేశారు. తొలుత స్థానిక సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ చేసి, అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని కొత్త పంచాయితీ వెలగవలస పరిధిలో గల పిండిలోవ, బిలగుడ్డి వలస, దోనిగుడివలస, సంగివలస గిరిజన గ్రామాల్లో రెండేళ్ల నుంచి ఉపాధి పనులు ఇవ్వలేదన్నారు. ములగ పంచాయతీలో ఉన్న వెలగవలస పంచాయతీని వేరు చేయడం వల్ల ఆన్లైన్లో పంచాయతీ చూపించడంలేదని, ఆన్లైన్లో లేని గ్రామాలకు ఉపాధి హామీ పనులు చేపట్టలేమని సిబ్బంది చెబుతున్నారని అన్నారు. ఇప్పటికే పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లోని గ్రామస్తులంతా పనుల్లేక వలస బారిన పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని వెలగవలస పంచాయతీలో ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తడంగి కృష్టయ్య, ఆర్‌.సాంబయ్య, రాము, వేతనదారులు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు సిపిఎం మద్దతు తెలిపింది.

➡️