ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించాలి

Apr 1,2024 21:12

ప్రజాశక్తి- పాచిపెంట : ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లాంచాలని కోరుతూ మండలంలోని గరిల్లవలస గ్రామం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సుర్రు రామారావు ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఐదు వారాలుగా పనిచేసిన ఉపాధి కూలీలకు రెండు నెలల దాటిన నేటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. పనిచేసిన 14 రోజులకే బిల్లులు చెల్లించాలని చట్టంలో ఉన్న చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే ఉపాధి బిల్లులు చెల్లించి గిట్టుబాటు కూలి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని, వెంటనే పనులు ప్రారంభించాలని పని దినాలు పెంచాలని, 2 వందల రోజులు పనులు ఇచ్చి కేరళ రాష్ట్రం తరహాలో 600 రూపాయలు రోజుకూలి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ ఎర్రజెండా నాయకత్వంలో సాధించుకున్న ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయని ఉపాధి హామీని సక్రమంగా అమలు చేసిన రాష్ట్రం కేరళ అని కేరళ తరహాలో ఉపాధిని ముందుకు నడిపించే విధంగా చర్యలు చేపట్టాలని పనిచేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంతో పాటు అవినీతికి తావు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఉపాధి చట్టం వల్ల వలసలు తగ్గాయని ఇటువంటి పరిస్థితుల్లో కూలి డబ్బులు సక్రమంగా చెల్లించకపోతే మరల వలసలు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఇప్పటికైనా ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించి పని దినాలు పెంచాలని పనులు వెంటనే ప్రారంభించాలని, పారలు, గుణపాలు పంపిణీ చేయాలని కోరారు.

➡️