ఉపాధ్యాయులపై అణిచివేత ధోరణి తగదు

Jan 3,2024 23:19
జీతాల చెల్లింపులో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

జీతాల చెల్లింపులో తాత్సారం చేస్తూ ఉద్దేశ్యపూర్వ కంగానే ఉపాధ్యాయులపై ప్రభుత్వం అణిచివేతకు పాల్పడుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ విమర్శంచారు. ప్రతి నెల 1న జీతాలు, పిఆర్‌సి, డిఎలు, పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ తదితర ఆర్థిక బకాయిల సాధనకై యుటిఎఫ్‌ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 12 గంటల ఆందోళన కార్యక్రమం బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.జయకర్‌ అధ్యక్షతన జరిగింది. ముందుగా భారతదేశ తొలి ఉపాధ్యా యిని సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సాహారం చేస్తూ ఉపాధ్యాయులపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన 12వ పిఆర్‌సి కమిషన్‌ కంటి తుడుపు చర్యగా కనిపిస్తోందని, కమిషన్‌ నియమించిందే తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే 12వ పిఆర్‌సి కార్యక్రమాలు మొదలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎవరైతే సిపిఎస్‌ రద్దుచేసి, ఒపిఎస్‌ అమలు చేయడానికి సమ్మతిస్తారో వారికే బాహాటంగా తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సిఎం తీసుకుంటున్న విధానాల వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని ఒకపక్క చెబుతున్న ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించమంటే ఖజానాలో డబ్బులు లేవని ఆర్థికమంత్రి బుగ్జన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 9, 10 తేదీల్లో విజయవాడలో 36 గంటల నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.నీరో చక్రవర్తిలా జగన్‌ పాలన’రోమ్‌ నగరం తగులబడుతుంటే పిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలన ఉంది’ అని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఉపాధ్యా య నిరసన కార్యక్రమంలో ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ అంగన్‌వాడీలు, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు, మున్సిపల్‌ కార్మికులు, ఉపాధ్యాయులు తమకు రావలసిన బకాయిల గురించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని రోడ్డెక్కి పోరాటాలు చేస్తుంటే ఏమీ ఎరగనట్టు తాడేపల్లిలో కూర్చుని ముఖ్యమంత్రి ‘ఆడుదాం ఆంధ్ర’ అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జగన్‌ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలోకి తొక్కారని అందుకే వేతనజీవులంతా ‘పోరాడుదాం ఆంధ్ర’ అంటూ పోరుబాట పట్టారని వెంకటేశ్వరరావు అన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠ శాలలు కుంటిపడుతున్నాయని, ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిం చుకోవడానికి ముందుకు రావాలని కోరారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వైఎస్‌ జగన్‌ సిఎం ఐన తరువాత మాటతప్పి, మడమ తిప్పి సిపిఎస్‌ కంటే దారుణమైన జిపిఎస్‌ను అమల్లోకి తీసుకొచ్చి ఉపాధ్యా యులకు తీరని నష్టాన్ని చేకూర్చుతున్నారని విమర్శంచారు. దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణకుమారి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, శ్రామిక వర్గాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అణగతొక్కుతోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,094 కోట్లు బకాయి పడిందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా మహిళా అసోసియేట్‌ విజరు గౌరీ, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇవివిఎస్‌ఆర్‌.ప్రసాద్‌, కాకినాడ జిల్లా యుటిఎఫ్‌ అధ్యక్షులు నగేష్‌బాబు, తూర్పుగోదావరి జిల్లా యుటిఎఫ్‌ సంఘం గౌరవ అధ్యక్షులు శంకరుడు తదితరులు మాట్లాడారు. జిల్లా కార్యదర్శులు శ్రీమణి, కె.రమేష్‌ బాబు, పి.శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️