ఉరితాళ్లతో అంగన్‌వాడీల ఆందోళన

Jan 2,2024 22:04
ఫొటో : వినూత్న రీతిలో ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీలు

ఫొటో : వినూత్న రీతిలో ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలియజేస్తున్న అంగన్‌వాడీలు
ఉరితాళ్లతో అంగన్‌వాడీల ఆందోళన
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు విరమించబోమని అంగన్‌వాడీ కార్యకర్తలు ఇప్పటికే స్పష్టం చేశారు. గత 21 రోజు నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో పలు రకాలుగా నిరసనలు చేపట్టారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 22వ రోజు అంగన్‌వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో మెడకు ఉరితాళ్లతో ఆందోళన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సిఐటియు అధ్యక్షులు టివివి ప్రసాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే ఈ పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీల డిమాండ్ల సాధనకు గత 21 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఉద్యమాన్ని మరింత తీవ్ర పరిచి ఉన్న ఎంఎల్‌ఎలు, మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి కాకాణి నివాసాన్ని ముట్టడించేందుకు అంగన్‌వాడీలు వెళ్తుంటే పోలీసులు తమను అరెస్టు చేయాలని చూస్తే అంగన్‌వాడీల ఐక్యమత్యానికి ప్రభుత్వం వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్‌ యాప్‌ విధానం రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, గ్రాడ్యుటీ, పెన్షన్‌ అమలు చేయాలన్నారు. అదేవిధంగా 22 రోజుల దీక్షా సమయంలో కూడా వేతనాలు అంగన్‌వాడీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షులు మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిఐటియు నాయకులు గడ్డం అంకయ్య, వేగూరు వెంకయ్య, ఎస్‌.కె.చాన్‌బాషా, మనోహర్‌, దయాసాగర్‌, మాల్యాద్రి, అంగన్‌వాడీ వర్కర్ల నాయకులు శారదమ్మ, గీతాదేవి, మస్తానమ్మ, స్వర్ణమ్మ, సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️