ఊళ్లు, పొలాల నిండా నీళ్లు

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో సత్తెనపల్లి ప్రాంతంలో రెండ్రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంటపొలాల నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. మిర్చి, వరి, మొక్క జొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించి. దినసరి కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు సాగునీటి కోసం అష్టకష్టాలు పడిన రైతులు ట్యాంకర్లు ద్వారా మిర్చి పొలాలకు సాగునీరు పెట్టుకున్నారు. తాజా వానలతో ఆ పొలాలన్నీ నీట మునిగాయి. ఈదురు గాలులకు పూత, పిందె రాలిపోయింది. మిర్చి మొక్కలు నేలకు ఒరిగాయి. మొక్కలు ఉరకెత్తుతాయని రైతులు వాపోతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్నా వరి పంట నేలకొరిగింది. పాకాలపాడు రెంటపాళ్ల, కుందురువారిపాలెం గ్రామాల్లో మొక్క జొన్న పంటలు నేలకు ఓరిగాయి. నందిగామ ఊరి ముందువున్న వాగు పొంగి పొర్లి ప్రవహించి సత్తెనపల్లి – అమరావతి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందిగామలోని భీమవరం డొంకలో వున్న ఇళ్లు వర్షానికి నీటమునిగాయి. సత్తెనపల్లి పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన నాగన్నకుంట, సుందరయ్య కాలనీలు జలమయమయ్యాయి. నాగన్నకుంటలో ఇళ్ళలోకి నీళ్ళు చేరటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌ నుండి సత్తెనపల్లి మీదుగా శబరీ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. వానల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రజాశక్తి – మాచర్ల : నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలోని పలువురు రైతులు బోర్ల కింద వరి సాగు చేయగా కొద్దిమంది ఇప్పటికే తమ పంటను ఇళ్లకు చేర్చుకున్నారు. మరికొంతమంది ధాన్యాన్ని పొలాల్లో ఉంచారు. వానల నేపథ్యంలో కోతకు వచ్చిన వరి పంట నేల వాలిపోయింది. వర్షపు నీరు పొలాల్లో నిలబడి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతకోసిన మిర్చి కూడా కళ్లాల్లోనే ఉంది. ఆరబెట్టిన మిర్చిపై ఎన్ని పట్టాలు కప్పినా నిమ్ము తగిలి కాయ దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. జమ్మలమడకకు చెందిన వరి రైతు బాసెట్టి వెంకటేశ్వర్లు వర్షంలో పొలానికి వచ్చి పడిపోయిన వరి పంటను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజులు ఇలాగే నీళ్లలో నానిపోతే పంట ఎందుకు పనికిరాదని, ఎకరానికి కౌలు సహా రూ.50 వేలు పెట్టుబడి పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఎకరాల వరి పంట వేసినట్టు తెలిపారు. మరోరైతు కోటేశ్వరమ్మ మాట్లాడుతూ పండించిన పంట చేతికి వచ్చింది అనుకునే సమయానికి వానొచ్చి, వానపాలవుతుంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాని ఆవేదనకు గురయ్యారు. భర్త పిల్లలు కుటుంబం అందరం కలిసి ఈ రెండు రోజుల నుండి పట్టాలపై ఉన్న నీళ్లు తొలగించడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోందని అన్నారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం చేయకుంటే కోలుకోలేమని చెబుతున్నారు.

ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించింది. మండలంలో అధికంగా సాగైన పత్తికి తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. మళ్లీ ఇప్పుడు వానలతో తాము పూర్తిగా నష్టపోతామని రైతులంటున్నారు. ఇదిలా ఉండగా ఇరుకుపాలెం వద్ద ఈదురుగాలుల ధాటికి రహదారి పక్కనున్న భారీ చెట్టు అటుగా వెళ్తున్న ఆర్‌టిసి బస్సుపై పడింది. బస్సు అద్దాలు పగిలినా ప్రమాణికులంతా క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎడతెరిపిలేని వాన నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ప్రజాశక్తి – యడ్లపాడు : మండలంలోని దింతెనపాడులో శనగ, మిర్చి పొలాలు నీట మునిగాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే తాము పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతామని రైతులు, కౌలురైతులు వాపోతున్నారు.  సుబాబుల్‌ తోటల్లో పని కోసం ప్రకాశం జిల్లా కందుకూరు నుండి యడ్లపాడు మండలంలోని సంఘం గోపాలపురం వెళ్ల మార్గంలో ఆర్‌ఎస్‌ సూపర్‌ మార్కెట్‌ సమీపంలో తోటలకు వచ్చిన వలస కూలీలకు అధికారులు ఆహారాన్ని సమకూర్చారు. కందుకూరు నుండి 20 మందికి రావడంతో, వీరికి సరైన ఆశ్రయం లేక ఇబ్బంది పడడాన్ని గమనించిన తహశీల్దార్‌ వైవిబి కుటుంబరావు, ఆర్‌ఐ చక్రవర్తి తదితరులు ఆహరపు ప్యాకెట్‌లు, బ్రేడ్‌ లు, బిస్కట్‌ ప్యాకెట్‌లు పంపిణీ చేశారు.

ప్రజాశక్తి – పెదకూరపాడు : మండలంలోని మిరప పొలాల్లో వర్షపునీరు నిలిచింది. వర్షానికి తోడు గాలి కూడా వీచటంతో మొక్కలని ఒరిగాయి. మిరప కుళ్లిపోయే అవకాశం ఉంది. ప్రత్తి పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. శనగ వంట కూడా కుళ్ళి పోయే అవకాశం ఉంది. గ్రామాల్లో వాగులు, వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్‌ సరఫరా పలుమార్లు నిలిపివేశారు.

ప్రజాశక్తి – వినుకొండ : వర్షం వస్తే వినుకొండ ఆర్‌టిసి బస్టాండ్‌ ప్రాంగణం చెరువును తలపిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి బస్టాండ్‌ పరిసరాల్లో నీళ్లు నిలిచాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల మురుగునీరు, వర్షం నీరు కలిసి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో నిలిచింది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి తలెత్తుత్తి ప్రయాణికులు అవస్థ పడుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు స్థానికుల నుండి వస్తున్నాయి.మరోవైపు పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారుదల సరిగా లేని కారణంగా ప్రధాన డ్రెయినేజీలో ఎగువ నుండి కొట్టుకు వచ్చిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, చెత్త చెదారం అంతా కాల్వలో అడ్డుపడటంతో మురుగు నీటిపారుదల నిలిచిపోయింది. కారంపూడి రోడ్డు, నరసరావుపేట రోడ్డు, మార్కాపురం రోడ్డులోని ప్రధాన డ్రెయినేజీల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ వెంకయ్య వాటిని కార్మికులతో తొలగింపజేశారు.నూజెండ్ల మండలం జంగాలపల్లి ఎస్సీ కాలనీలో సుమారు 15 ఇల్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. వర్షపు నీరు కాలనీ చుట్టుముట్టడంతో పాటు దిగువలో ఉన్న నివాస గృహాల్లోకి నీరు చేరింది. ఎస్సీ కాలనీకి డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షం నీరంతా ఎల్ల మధ్యలో నిలిచి చెరువును తలపిస్తోంది.

ప్రజాశక్తి-ఈపూరు : మండలంలో వ్యవసాయ బోరు మోటార్ల కింద సాగుచేసిన వరి, మిర్చి పైర్లు మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నేలకొరిగాయి. సోమవారం రాత్రి నుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో అగ్నిగుండాల, ఊడిజర్ల, నల్లగొండ తండా, ఎర్రకుంట తండా, ఈపూరు, బొమ్మరాజుపల్లి, వనికుంట, అంగలూరు, శ్రీనగర్‌, బొగ్గరం, గుండెపల్లి, గోపువారిపాలెం, చిట్టాపురం గ్రామాల్లో వరి, మిర్చి పైరు దెబ్బతిన్నాయి. అంగలూరుకు చెందిన కట్టా శీను, మునుగోటి శేషయ్య మూడు ఎకరాల్లో సాగుచేసిన రేగి చెట్లు విరిగాయి. పంట కోత సమయంలో తుపాను తమను తీవ్రంగా దెబ్బతీసిందని రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

➡️