ఎంపీ సీట్లకు కొత్త ముఖాలే..?

ఎంపీ సీట్లకు కొత్త ముఖాలే..?

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధివచ్చే సార్వత్రిక ఎన్నికలు మంచి రసవత్తరంగా జరగనున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రత్యర్ధులు తలపడనున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తులు ముమ్మరం చేశాయి. స్థానిక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సన్నద్ధం చేస్తున్నాయి. బలాబలాలు బేరీజు వేస్తూ ఆచితూచి నియామకం చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక విషయంలో తలమునకలయ్యాయి. అయితే ఈసారి అన్ని పార్టీల నుంచి ఎంపి అభ్యర్థులు కొత్త ముఖాలే కనిపించనున్నాయి. 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి గెలుపొందిన కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం నుంచి వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌ రామ్‌ విజయం సాధించారు. వీరిలో వంగా గీత మినహా మిగిలిన ఇద్దరూ రాజకీయాలకు కూడా కొత్తే. కానీ ఇప్పుడు మిగిలిన ఇద్దరూ ఐదేళ్లకే పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ వైపు పయనిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి పోటీ చేసి అభ్యర్థులు కొత్త వారే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న వైసిపి మూడు సీట్లలోనూ సిట్టింగులను మార్చాలని ప్రయత్నిస్తోంది. రాజమహేంద్రవరం అర్బన్‌ సీటుపై ఎంపీ మార్గాని భరత్‌ కన్నుపడింది. అందుకు తగ్గట్టుగా ఆయన కొంతకాలంగా అక్కడ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నియోజకవర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సిటీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడం దాదాపుగా ఖాయం అయిపోయింది. పిఠాపురం నియోజకవర్గానికి కాకినాడ ఎంపీ పేరు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె పిఆర్‌పి నుంచి ఇక్కడ ప్రాతినిద్యం వహించడం కలిసి వస్తోంది. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసినా ఆమె తగిన అభ్యర్థి అవుతారనే అంచనాలో వైసిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. మరోవైపు అమలాపురం ఎంపీ అనురాధ పి.గన్నవరం గానీ లేదా అమలాపురం నుంచి పోటీలో ఉంటారని సమాచారం. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఎంఎల్‌ఎల అందరితోనూ ఉన్న విబేధాల రీత్యా ఎంపీ సీటుకి బదులుగా ఎంఎల్‌ఎ సీటు మారుతున్నట్టు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.2019లో టిడిపి తరుపున పోటీ చేసిన ముగ్గురిలో ఇద్దరు నేతలు ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. కాకినాడ నుంచి పోటీ చేసిన పారి శ్రామికవేత్త చల మలశెట్టి సునీల్‌ ఆ పార్టీకే దూరమయ్యారు. టిడిపిని వీడి వైసిపిలో చేరారు. మరోసారి కాకినాడ నుంచి వైసిపి తరుపున పోటీలో ఉంటారనే ఊహా గానాలున్నాయి. వరుసగా మూడు పార్లమెంట్‌ ఎన్నికల్లో మూడు పార్టీల తరుపున పోటీ చేసి ఓడిన ఆయన నాలుగోసారి పాత పార్టీ తరుపున పోటీలో ఉంటారా.. వైసిపి నుంచి బరిలో దిగుతారా అనేది ఇంకా తేలలేదు. అధికారికంగా ఖరారు కానప్పటికీ వంగా గీత స్థానంలో కాకినాడ ఎంపి సీటు సునీ ల్‌కు దక్కే అవకాశం ఉందనే వార్త కూడా వినిపిస్తోంది. టిడిపి తరుపున రాజమహేంద్రవరం బరిలో నిలిచిన మాగంటి రూపాదేవి రాజకీయాలకు దూరమయ్యారు. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఓటమి నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో మళ్లీ అడుగు పెట్టలేదు. వ్యాపార, సామాజిక వ్యవహారాలకే ఆమె పరిమితమయ్యారు. అమలాపురం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గంటి హరీష్‌ మాధుర్‌ మాత్రం నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈసారి కూడా ఆయన ఎంపీ సీటు ఆశిస్తున్నారు. కానీ అధిష్టానం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆయనకు అసెంబ్లీ సీటు కేటాయించి పి.గన్నవరం బరిలో దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే టిడిపి కూడా మూడు చోట్లా కొత్త నేతలను రంగంలో దింపాల్సి ఉంటుంది. జనసేన తరపున బరిలో నిలిచిన ముగ్గురు నేతలు సైతం భిన్నదారులు ఎంచుకున్నారు. కాకినాడ నుంచి పోటీ చేసిన జ్యోతుల వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. టిడిపి పొత్తులో జనసేనకు కాకినాడ సీటు కేటాయించినా జ్యోతులకు దక్కే అవకాశం దాదాపుగా లేదు. రాజమహేంద్రవరం ఎంపీగా బరిలో నిలిచిన ఆకుల సత్యన్నారాయణ ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించడం లేదు. జనసేనను వీడి వైసిపి తీర్థం పుచ్చుకున్నా ఆయన తర్వాత సైలెంట్‌ అయిపోయారు. అమలాపురం ఎంపిగా పోటీ చేసి ఓడిన డిఎంఆర్‌.శేఖర్‌ ఈసారి అమలాపురం ఎంఎల్‌ఎ సీటు కోసం ఆశాభావంతో ఉన్నారు. దీంతో జనసేన కూడా తనకు దక్కే ఎంపి సీట్లలో కొత్త నేతలను ఎంపిక చేయాల్సి ఉంటుంది.కొత్త ముఖాలేనా..!ఇప్పటికే టిడిపి తరుపున కాకినాడకు సానా సతీష్‌ బాబు, అమలాపురం ఎంపి సీటు కోసం మాజీ ఎంపీ హర్షకుమార్‌, రాజమహేంద్రవరం ఎంపీ సీటు కోసం శిష్టా లోహిత్‌ వంటి నేతలు క్యూలో ఉన్నారు. వైసిపి ఎంపిలుగా కాకినాడ నుంచి సునీల్‌, లేదా ముద్రగడ పద్మనాభం పేరు పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి కన్నబాబు పేరుని ఒక కీలక నేత ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. కానీ ఆయనకు అవకాశం తక్కువగానే ఉంటుంది. రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గానీ, మరో బిసి నేత డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ గానీ పోటీ చేస్తారనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. అమలాపురం నుంచి రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి ఒకరు ఆశాభావంతో ఉన్నారు. మొత్తంగా ఎక్కడ ఏ పార్టీ పోటీ చేసినా ఈసారి ఎంపి సీట్లకై పోటీలో ఉండే నేతలంతా దాదాపుగా కొత్త మొఖాలే ఉండేలా కనిపిస్తోంది.

➡️