ఎఎన్‌ఎంలపై పనిభారం తగ్గించాలి

Feb 18,2024 21:06

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : గ్రామ సచివాలయ ఎఎన్‌ఎంలపై పని భారం తగ్గించాలని యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్‌లో యూనియన్‌ నాయకులు డి.రమాదేవి అధ్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎ.మాధవి, నాయకులు సాయిప్రసాద్‌ మాట్లాడుతూ, గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఎఎన్‌ఎంలపై ప్రభుత్వం ఒత్తిడికి గురి చేస్తుందని, వర్క్‌ పెర్ఫార్మెన్స్‌ టార్గెట్‌ పేరుతో వారికి పనిచేయని ట్యాబులు, షుగర్‌ వ్యాధి, బిపి టెస్టులు, రక్త నమూనా సేకరణలో నాణ్యమైన రిపోర్టులు అందించలేదని వారిని తొలగించడానికి సోకాజ్‌ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్‌ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం నాణ్యమైన వైద్య పరికరాలను అందించకుండా ఆ తప్పులను సిబ్బందిపై నెట్టడం సమంజసం కాదని, రాష్ట్రంలో ఇటీవల ఆరుగురు ఎఎన్‌ఎంలను తొలగించిన సంఘటనే ఉదాహరణ అన్నారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ ఎఎన్‌ఎం (గ్రేడ్‌ 3 సిబ్బందిని)ను ఎంపిహెచ్‌ఎ ఫిమేల్‌గా ప్రమోట్‌ చేయాలని, యాప్‌ల భారాన్ని తగ్గించాలని, అందుకు తగిన శిక్షణ ఇవ్వాలని, జనాభా ప్రతిపాదించిన అదనపు సిబ్బందిని నియమించాలని, రికార్డుల నిర్వహణలో తగిన తర్ఫీదును ఇవ్వాలని, యూనిఫాం అలవెన్స్‌తో పాటు వర్క్‌ పెర్ఫార్మెన్స్‌ అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ జిల్లా నాయకులు ఢిల్లీశ్వరి, పలువురు గ్రామ సచివాలయ ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

➡️