ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి

ప్రజాశక్తి-పర్చూరు: ఎన్నికల కమిషన్‌ ఆదేశం మేరకు ఎలక్ట్రానిక్‌ అండ్‌ ప్రింట్‌ మీడియా పాత్రికేయులకు శిక్షణ, అవగాహన స్థానిక అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, బాపట్ల జిల్లా ఆర్‌డిఒ గంథం రవీందర్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన దగ్గర నుంచి ధర్మబద్ధం మార్గంలో ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రెస్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పనిచేయాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాతలు చేయకూడదని సూచించారు. ప్రతి ప్రకటనకు అకౌంటు ఉంటుందని, స్క్రోలింగులకు కూడా అకౌంట్‌ ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని తెలిపారు. పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్థి రూ.90 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని అన్నారు. మూడు పూటలా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తిరుగుతూ ఉంటుందని తెలిపారు. అట్లా ఏదైనా కంప్లైంట్‌ గనక వచ్చినట్టయితే అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం మద్యం, డబ్బుల పంపిణీ ప్రోత్సహించకూడదని వివరించారు. కార్యక్రమంలో పర్చూరు, మార్టూరు, యద్దనపూడి, కారంచేడు, చిన్నగంజాం తహశీల్దార్లు సిహెచ్‌ సుబ్బయ్య, కే సంధ్యశ్రీ, వై నాగరాజు, మెహర్‌బాబు, ఫణీంద్రబాబు, నియోజకవర్గంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.

➡️