ఎన్నికల కమాండ్‌ కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ పరిశీలన

Mar 18,2024 21:28

 ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్‌ : ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ సోమవారం పరిశీలించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, యంత్రాంగం ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్‌ రూం పనితీరును పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంనకు వచ్చే ఫిర్యాదులపై తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో ఎంసిసి బృందాలు, వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎస్‌టి, వీఎస్టీ, వీవీటీ, ఎస్‌ఎస్‌టి బృందాలు తమ నివేదికను ఎన్నికల కమిషను నిర్దేశించిన సమయంలోగా పంపించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారం, నామినేషన్‌, ఇతర అంశాలకు సంబంధించిన అనుమతులు సింగిల్‌ విండో విధానం సువిధలో సకాలంలో అందించాలని తెలిపారు.నివేదికల సమర్పణలో ఎటువంటి జాప్యం ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో కంట్రోల్‌ రూం ఇన్‌ ఛార్జ్‌, జాయింటు కలెక్టరు ఎస్‌ఎస్‌ శోబిక, ఇంచార్జి డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌వి సూర్యనారాయణ, వివిధ విభాగాల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిలో ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి కవాతు నిర్వహించారు.

➡️