పెట్టుబడి సాయం రూ.20వేలు అందించాలి

Jun 24,2024 21:44

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, దుక్కుల తదితర అవసరాల కోసం ప్రభుత్వం పెట్టుబడి సాయం రూ.20వేలు అందించాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.గోపాలం, బి.రాంబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున ప్రభుత్వం వెంటనే స్పందించి సాయమంది ంచాలని కోరారు. తాటిపూడి ప్రాజెక్ట్‌ కాలువలు పూడిక, డామ్‌ వద్ద షట్టర్లు పాడవటం వల్ల పొలాలకు నీరు సక్రమంగా వెళ్లక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి పంపిణీ సిబ్బంది, లష్కర్లు లేకపోవటం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లక రైతులు ఏటా పంటలు నష్టపోతున్నారన్నారు. మధుపాడ నుండి రామబద్రపురం డివిజన్‌ డామ్‌ వరకు కాలువ జంగిల్‌, పూడిక తొలగించాలన్నారు. బోనంగి సేరి కాలువ వద్ద ముటా కాలువకు గండి పడటం వల్ల ఆ కాలువ దిగువన 400 ఎకరాలకు నీరు వెళ్లడం లేదని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గుర్ల గెడ్డ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ధర్నాలో రైతు సంఘం నాయకులు ఎల్‌.ఆదినారాయణ, అర్‌.సత్యం, టి.పైడిపినాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు రైతులు పాల్గొన్నారు.

➡️