ఎన్నికల కోడ్‌ ఎప్పుడు వచ్చినా సన్నద్ధం : కలెక్టర్‌

Mar 12,2024 23:42

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాగం సన్నద్ధంగా ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఫామ్‌ 6, 7, 8 అన్నీ కలిపి 56,052 రాగా 32,540 వరకు పరిష్కరించామని, 6, 7 ఫారాల్లో సరైన ఆధారాల్లేని కారణంగా 13,255 దరఖాస్తులను తిరస్కరించామని, బిఎల్వోల వద్ద 7,263 పెండింగ్‌ ఉన్నాయని వివరించారు. ఈ ప్రక్రియ ఎన్నిక నామినేషన్‌ ప్రక్రియ జరిగే ముందు రోజు వరకూ ఉంటుందన్నారు. అర్హులెవరైనా ఉంటో ఇప్పటికీ ఓటు నమోదుకు అవకాశం ఉందన్నారు. ఎన్నికల కోడ్‌ అమలుకు జిల్లాలోని 28 మండలాలకు సంబంధించి ఎంపీడీవోలతో 34 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, పోలింగ్‌ ప్రక్రియను వీడియో తీసేందుకు 7 పోలీస్‌, సంబంధిత అధికారులతో వీడియో తీస్తామని పేర్కొన్నారు. ఎన్‌సిసి టీమ్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను 33 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ రాగానే ఎన్నికల పరిశీలకులతోపాటు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తమ కార్యాలయంలో ఒక బోర్డును ఏర్పాటు చేస్తారని, అక్కడే ఎన్నికల అధికారులంతా సమావేశమై ఎన్నికల విషయమై చర్చిస్తారని చెప్పారు. అక్కడ ప్రతి డ్యూటీలో ఏడుగురు సిబ్బంది ఉంటారన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని, మీడియాకూ ఒక గది కేటాయించామని చెప్పారు. ఎక్కడైనా ఈవీఎం, వివి ప్యాట్లు పని చేయకుంటే వాటి స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేస్తామని, జిల్లాకు అవసరమైన ఎన్నికల సామగ్రితోపాటు 130 శాతం అదనంగా కేటాయించారని తెలిపారు. పలు యాప్‌లను ఎన్నికల కమిషన్‌ అందుబాటులో తెచ్చిందని, సీనియర్‌ సిటిజన్స్‌ కోసం సి విసిట్‌, సీజర్‌ యాప్‌, ఇఎంఎస్‌, సువిధ యాప్‌లు ఉన్నాయన్నారు. నోటిఫికేషన్‌ విధులైన తర్వాత సి విజిల్‌ యాప్‌ అందుబాటులోకి వస్తుందని, దీనిని ప్రతి ఒక్కరు డౌన్లోడ్‌ చేసుకోవాలని సూచించారు. సి విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చే సమస్యలపై వంద నిమిషాల్లో స్పందన ఉంటుందని తెలిపారు.
సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
నరసరావుపేట మండలంలోని అల్లూరువారిపాలెం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్‌ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️