Kalki Movie Review : కల్కి 2898 ఏడీ మూవీ రివ్యూ

Jun 27,2024 19:32 #kalki movie review, #prabhas

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, ప్రముఖ బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభాస్‌ మూవీ జూన్‌ 27న విడుదలైంది. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో తెలుసుకుందాం..!

కథ
కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి నాశనం అవుతుంది. భూమిపై తొలి నగరంగా కాశీ మాత్రమే మిగిలి ఉంటుంది. కాశీ ప్రజలు తాగేందుకు నీరు కూడా లేక ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు ప్రకృతి సుప్రీం యాష్కిన్‌ (కమల్‌హాసన్‌) సకల వనరులతో కాంప్లెక్స్‌ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ఈ కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే ఒక మిలియన్‌ యూనిట్స్‌ (డబ్బులు) ఉండాలి. ఊహకందని ప్రపంచమైన యాష్కిన్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్లేందుకు కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్‌ భైరవ (ప్రభాస్‌) కూడా ఒకడు. ఎలాగైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది భైరవ కోరిక. కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే యూనిట్స్‌ (డబ్బు) కావాలి. ఆ యూనిట్స్‌ కోసం ఎలాంటి పని చేయడానికైనా భైరవ సిద్ధపడుతుంటాడు. అతనికి తోడుగా బుజ్జి (ఎఐ టెక్నాలజీ సాయంతో ఆలోచించే మెషీన్‌) ఉంటుంది. కాంప్లెక్స్‌లో ప్రాజెక్టు కె పేరుతో గర్భవతులైన మహిళల సీరంతో యాష్కిన్‌ ఓ ప్రయోగం చేస్తుంటాడు. ఎంతోమంది మహిళల్లాగే సుమతి (దీపికా పదుకొణె) కూడా కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గర్భవతి అవుతుంది. క్లాంప్లెక్స్‌లో చిక్కుకున్న సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌) ప్రయత్నిస్తుంటాడు. అసలు అశ్వత్థామ అంతమంది మహిళలు ఉండగా సుమతినే ఎందుకు కాపాడాలనుకుంటాడు? భైరవ గతం ఏంటి? సుప్రీం యాష్కిన్‌ చేసే ప్రాజెక్టు కె ప్రయోగం వల్ల ప్రయోజనం ఏమిటి? చివరికి భైరవ కాంప్లెక్స్‌కి వెళతాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’ మూవీతోనే తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. ఆ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత రెండో సినిమానే ‘కల్కి’. ఈ సినిమా పురాణాలకు, సైన్స్‌లకు లింక్‌ పెడుతూ కథ ఉంటుందని దర్శకుడు ముందే చెప్పాడు. కథకు తగ్గట్టుగానే నటులను ఎంపిక చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. కాశీ, కాంప్లెక్స్‌, శంబాల ప్రపంచాల పరిచయాలు ప్రేక్షకుల ఊహకందని రీతిలో ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే హీరో ప్రభాస్‌ ఎంట్రీ అదిరిపోతుంది. కథలో ఒక్కొక్క పాత్ర పరిచయం ఆసక్తిని పెంచుతుంది. పాత్రల పరిచయానికి టైం ఎక్కువగా ఉన్నా.. ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా దర్శకుడు వాటిని తీర్చిదిద్దాడు. అది ఈ సినిమాకు ప్లస్‌. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో ప్రభాస్‌, అమితాబ్‌ల మధ్య వచ్చే యాక్షన్‌ సీన్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. అమితాబ్‌ మహాభారతాన్ని చెప్పడం.. అందులో దర్శకుడు రాజమౌళి, దుల్కర్‌ సల్మాన్‌, విజరు దేవరకొండ లాంటి స్టార్స్‌ కనిపించడంతో ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. పార్ట్‌ 2 అంతా భైరవ, సుప్రీం యాష్కిన్‌ల మీదే ఉందని డైరెక్టర్‌ చెప్పకనే చెప్పాడు. ఓవరాల్‌గా సినిమా మరో ప్రపంచానికి తీసుకెళుతుంది. హాలీవుడ్‌ మూవీస్‌ని తలపించేలా ఉందీ చిత్రం. ముఖ్యంగా చిన్నారులను బాగా అలరిస్తుంది.


ఈ చిత్రంలో పాటలు గుర్తుంచుకునేలా లేవు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

➡️