ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

Feb 19,2024 21:00

ప్రజాశక్తి – కురుపాం  : రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆర్‌డిఒ వివి రమణ కోరారు. సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ ఎ.వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గల ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎన్నికల నిర్వహణపై జరిగే సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న పోలింగ్‌ స్టేషన్లుంటే వాటి స్థానంలో వేరే దగ్గర పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటుకు గుర్తించాలని కోరారు. అలాగే అన్ని పోలింగ్‌ స్టేషన్లో ఓటర్లు, వృద్ధులు మౌలిక వసతులకు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు సక్రమంగా ఉండేలా అధికారులు చొరవ తీసుకొని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఐదు మండలాలు తహశీల్దార్లు, ప్రజా ప్రతినిధులు, వైసిపి గ్రీవెన్స్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కె. మల్లేశ్వరరావు, టిడిపి మండల కన్వీనర్‌ కెవి కొండయ్య, పోలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలివాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆర్‌డిఒ రమణకు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకులో దూరంగా ఉంచాలని, సొంత గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని ఎన్నికల విధుల నుంచి పక్క మండలంలో ఎన్నికల విధుల్లోకి మార్చాలని, ఆన్‌ లైన్లో ఫారం-6 చేర్పులను త్వరగా పరిశీలించాలని కోరారు. అలాగే మరణించిన, డబల్‌ ఎంట్రీ ఉన్న ఓటర్లను తొలగించి ఫారం -8 సవరలను సరిచేయమని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కె.మల్లేష్‌, టిడిపి మండల కన్వీనర్లు కెవి కొండయ్య, శేఖర్‌ పాత్రుడు, పోలూరు శ్రీనివాస్‌, బిజెపి సీనియర్‌ నాయకులు నడుకూరు దులికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️