ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి

Mar 11,2024 23:19

గుంటూరులో నిరసన

నరసరావుపేటలో నిరసన
ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) బ్రాంచీల వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరులోని నగరంపాలెం బ్రాంచ్‌ వద్ద నిరసనకు సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్‌బిఐ యాజమాన్యం ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా కేంద్రంలోని బిజెపి క్విడ్‌ ప్రోకోకు పాల్పడిందన్నారు. కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధానాలు అనుసరిస్తూ, తిరిగి వారి నుండి నిధులు తీసుకుందని, మొత్తం ఎన్నికల బాండ్లలో 55 శాతం బిజెపికి, మరొక 30 శాతం ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు వెళ్లాయనని తెలిపారు. దేశంలో సిపిఎం ఒక్కటే ఎన్నికల బాండ్లు తీసుకోలేదన్నారు. సిపిఎం ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ అని, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. నళినీకాంత్‌ మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. 21 రోజుల గడువులో వెల్లడించకపోగా, మరొక 116 రోజులు గడువు కోరటం బిజెపిని కాపాడటానికే అన్నారు. బ్యాంకింగ్‌ ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్‌ అయిన నేపథ్యంలో ఏ సమాచారమైనా క్షణాల్లో వెల్లడించే అవకాశం ఉన్నా దాదాపు నాలుగు నెలలకుగాపై గడువు కోరడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు అయ్యే వరకూ వివరాలు వెల్లడించకుండా ఎస్‌బిఐపై కేంద్రం ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎస్‌బిఐ తక్షణమే ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఖాసింవలి, ఖాసిం షహీద్‌, నికల్సన్‌, కె.శ్రీనివాసరావు, బాషా, వెంకట్రావు, అక్బర్‌ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం ఉరవకట్ట బ్రాంచ్‌ వద్ద నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడానికి ఎన్నికల బ్లాడ్ల రూపంలో ఫండ్‌ తీసుకుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఈ డబ్బును ఉపయోగించే బిజెపి మళ్లీ గెలవాలని చూస్తోందని, అందుకే ఆ వివరాలు బయటకు రాకుండా ఎస్‌బిఐపై ఒత్తిడి చేస్తోందని అన్నారు. అనంతరం బ్రాంచ్‌ మేనేజర్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు డి.శివకుమారి, శిలార్‌ మాసూద్‌, టి.పెద్దిరాజు, ఎం.ఆంజనేయులు, కె.నాగేశ్వరావు, వెంకటేశ్వరరాజు, దుర్గారావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌ వద్దగల ఎస్‌బిఐ బ్యాంక్‌ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం మేనేజర్‌ రాజశేఖర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. టి.ప్రతాపరెడ్డి, పి.భారతి, ఎస్‌.లూథర్‌, ఎస్‌.బాబు, పి.రాజు, బి.నాగేశ్వరరావు, అచ్చిరెడ్డి, బి.కోటనాయక్‌, పి.సుబ్బారావు, రాజు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – యడ్లపాడు : మండల కేంద్రమైన యడ్లపాడులోని ఎస్‌బిఐ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు ఎన్‌.కాళిదాసు, కె.రోశయ్య, ఎం.సీతారామయ్య, ఎం.రామారావు, సిహెచ్‌ నాగేశ్వరరావు, జె.శంకరరావు, పి.సాంబశివరావు, జి.హరిబాబు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️