పంక్చర్‌ గమ్‌తో బతుకులకే పంక్చర్‌

Jun 20,2024 22:41

పంక్చర్లు వేయడానికి వాడే గమ్‌
ప్రజాశక్తి-చిలకలూరిపేట :
మార్కెట్లో తక్కువ ధరలకు లభించే గమ్‌ సొల్యూషన్లను (పంక్చర్‌ గమ్‌) మత్తు కలిగించే ప్రేరకంగా కొందరు వినియోగిస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు వీటికి అలవాటు పడుతున్నారు. ఒక్కసారి అలవాటయ్యాక దాన్నుండి బయటపడలేక బానిసలుగా మారుతున్నారు. మద్యం, గంజాయిలకు మించి చాపకింద నీరులా ఈ మత్తు వ్యసనం వ్యాపిస్తోంది. పంచర్లు వేసుకోవడానికి వాడే వస్తువులతో అనేక మంది యువకులతోపాటు చిన్నారులూ తమ జీవితాలనే పంచర్‌ చేసుకుంటున్నారు.పట్టణంలోని నెహ్రూనగర్‌, గుర్రాలచావిడి, తూర్పుమాలపల్లె, సంజీవనగర్‌ తదితర ప్రాంతాల్లో వీటి వాడక ఎక్కువగా ఉంటోంది. ఊరి బయట పొలాలు, పాతభవనాల్లో కూర్చుని యువకులు వీటిని వినియోగిస్తున్నారు. చేతిరుమాలులో సొల్యూషన్‌ పేస్టు వేసి నోటితో పీలుస్తూ మత్తులో తూగుతున్నారు. 100 గ్రాముల లోషన్‌ ట్యూబ్‌ను తడవకు 20-25 గ్రాములు వేసుకుని నోటి ద్వారా గట్టిగా పీలిస్తే వచ్చే మత్తు ప్రభావం సుమారు గంటా రెండు గంటల వరకు ఉంటుంది. ఇలా రోజుకు కనీసం రెండు మూడు సొల్యూషన్ల ట్యూబులను పీల్చేవారున్నారంటే దీనికి ఎంతలా బానిసలుగా మారుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పసిపిల్లలను సంకలో పెట్టుకుని భిక్షాటన చేసే మహిళలు తమ పిల్లలకు గమ్‌సోల్యూషన్‌ మత్తును ఇస్తున్నారు. వీటి ప్రభావం వల్ల ఆ పిల్లలు ఎండైనా, వానైనా ఏడవకుండా చంకల్లోనే వేళ్లాడుతున్నారు. ఇలా పీల్చిన వారు కేవలం నెలల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాపాయస్థితికి చేరతారని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల నెహ్రూ నగర్‌లో ఒకరికి గమ్‌సొల్యూషన్‌ పీల్చడం వల్ల గుండె బాగా దెబ్బతిని మృత్యువాతా పడ్డారు.సాధారణంగా గమ్‌ సొల్యూషన్లను వివిధ రంగాల్లో వస్తువులను అతికించేందుకు వినియోగిస్తారు. వీటిలోని రసాయనాలకు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంటుంది. ఈ రసాయనాల ఆవిరి, ఘాటు కారణంగా కళ్ల మంట, తల తిరగటం తదితర సమస్యలొస్తాయి. వీటిని పని కోసం వాడే సమయంలో కార్మికులు ముక్కుకు గుడ్డ కట్టుకుని వీటి దుష్ప్రభావాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటిస్తారు. టీవీ మెకానిక్‌లు, చెప్పుల తయారీ కార్మికులు వారి పనుల కోసం వీటిని వాడుతుంటారు. ఎలక్ట్రానిక్‌ దుకాణాల్లో లభ్యమయ్యే వీటిని వీటిని ఎవరికంటే వారికి విక్రయించకూడదనే నిబంధనలున్నాయి. వీటిని వినియోగించే రంగాల్లో పనిచేసే వ్యక్తులు, కార్మికులకే విక్రయించాలి. మైనర్లకు అమ్మకూడదు. వీటి కొనుగోలుకు వచ్చే వారిపట్ల విక్రేతలకు అనుమానం కలిగితే పోలీసులకు, సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ నిబంధనలను ఇక్కడెవరూ పాటించడం లేదు. కొన్ని దుకాణాల్లో రోజుకు 70-100 వరకూ గమ్‌సొల్యూషన్‌ ట్యూబులు అమ్ముతుండడం మీరుతున్న నిబంధనలకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, యువత మత్తులో చిత్తవకుండా, ఆరోగ్యాలను నాశనం చేసుకోకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

➡️