ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభం

Dec 27,2023 12:04
ఎస్‌ఎఫ్‌ఐ

జెండాను అవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్‌
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం
భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) 24వ రాష్ట్ర మహాసభ కాకినాడలోని అల్లూరి సీతారామరాజు నగర్‌, ధీరజ్‌ సభా ప్రాంగణంలో ఉత్సాహపూర్తమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్‌ ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు విపి.సాను అమరవీరుల స్తూపానికి, అల్లూరి సీతారామరాజు, ధీరజ్‌ రాజేంద్రన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆలిండియా ఉపాధ్యక్షులు ఆదర్శ సాజి, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షులు వై.వెంకటేశ్వరరావు, పిడిఎఫ్‌ మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రహ్మణ్యం, తదితరులు నివాళులర్పించారు. మహాసభ ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘వీరులారా వందనం.. విద్యార్థి అమరులారా వందనం మీ పాదాలకు’… అంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గీతాలు ఆలపించారు.ఆకట్టుకున్న సభా ప్రాంగణంఅల్లూరి సీతారామరాజు నగర్‌లో ధీరజ్‌ సభ ప్రాంగణంలో మహాసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు. మహాసభ ప్రాంగణం వద్ద 1970 సంవత్సరం నుంచి 2021 వరకు ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ఫోటో ఫ్రేమ్స్‌ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద సెల్ఫీ ఫ్రేమ్‌, ఐ లవ్‌ ఎస్‌ఎఫ్‌ఐ, ప్రధాన ద్వారం ఎదురుగా ‘మా స్ఫూర్తి’ అంటూ దేశ, అంతర్జాతీయ నాయకుల చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజానాట్యమండలి కళాకారులు విద్యార్థి ఉద్యమ గీతాలను ఆలపించారు.

➡️